Prakasam: ప్రకాశం జిల్లాలో రూ.1.97 కోట్ల సైబర్ మోసం!

Prakasam: అద్దంకిలో ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం; అధిక లాభాల ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి రూ. 1.97 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు.

Kolla Singaiah, Addanki
Published on: 15 Oct 2026 3:59 PM IST
Prakasam
X

Prakasam: ప్రకాశం జిల్లాలో రూ.1.97 కోట్ల సైబర్ మోసం!

Prakasam: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1,97,60,870లు వసూలు చేసిన సైబర్ నేరగాళ్లపై అద్దంకి పోలీసులు కేసు నమోదు చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా పరిచయం పెంచుకుని, ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో భారీ మొత్తాన్ని కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ఉత్తర అద్దంకి పరిధిలోని కొత్త దామవారిపాలెంకు చెందిన పర్చూరి సురేష్ బాబు (41)ను నిందితులు సాన్వి వాధ్వా, భూమిక ధోలా, జిమీత్ మోదీ వాట్సాప్ ద్వారా వివిధ గ్రూపుల్లో చేర్చారు. అనంతరం SAMCO Securities Limited సంస్థకు సంబంధించిన iOS అప్లికేషన్ లింక్‌ను పంపించి, ఐపీఓలు, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందవచ్చని నమ్మించారు.

నిందితుల మాటలు నమ్మిన సురేష్ బాబు 2026 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 24 వరకు విడతల వారీగా ఆన్‌లైన్ ద్వారా మొత్తం రూ.1,97,60,870లు పెట్టుబడిగా చెల్లించారు. అయితే, పెట్టుబడులపై వచ్చినట్లు చూపించిన లాభాలను ఉపసంహరించుకోవాలంటే మరింత డబ్బు చెల్లించాలని నిందితులు కోరారు. కొంతకాలం తర్వాత వారు వాట్సాప్ గ్రూపుల్లో స్పందించడం మానేయడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించారు.

దీంతో బాధితుడు అక్టోబర్ 10న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ 30210260019170 ఆధారంగా సీఐడీ సైబర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

తనకు జరిగిన రూ.1,97,60,870ల నష్టాన్ని నిందితుల నుంచి రికవరీ చేసి న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు అక్టోబర్ 13న సాయంత్రం 4 గంటలకు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అద్దంకి పోలీసులు క్రైమ్ నంబర్ 269/2026 కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 319(2), ఐటీ చట్టంలోని సెక్షన్లు 66(C), 66(D) కింద కేసు నమోదు చేసినట్లు వివరాల్లో పేర్కొన్నారు

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki