Banswada: 44 ఫీట్ల బతుకమ్మను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 44 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే మూడో ఎత్తైన బతుకమ్మను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 11 Oct 2026 9:35 PM IST
Banswada
X

Banswada: 44 ఫీట్ల బతుకమ్మను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 44 ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు చేసిన అడుకుల బతుకమ్మను శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే మూడవ ఎత్తైన బతుకమ్మగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బతుకమ్మను బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ "డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద అయ్య స్వాములు, దుర్గామాత దీక్షాపరులు అందరూ కలిసి ప్రపంచంలోనే మూడో ఎత్తైన 44 ఫీట్ల బతుకమ్మను తయారు చేయడం చాలా గొప్ప విషయం. ఇది ఎవరికీ సాధ్యం కాని పని, వీరు ఎంతో ఇష్టంతోనే ఈ పని చేయగలుగుతారు. వారి కష్టాన్ని అభినందించాలి. ఎల్నినో ప్రభావం తగ్గి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాం. ఈ తొమ్మిది రోజులు ఇక్కడ ప్రతినిత్యం ఆటపాటలు కొనసాగుతాయి. బతుకమ్మ పండుగకు కులం, మతం లేదు. ఆడబిడ్డలందరూ వచ్చి ఆనందోత్సవాల్లో పాల్గొనాలి" అని పిలుపునిచ్చారు.

ఈ భారీ బతుకమ్మను గౌలిగూడ వినోద్ స్వామి ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు ఎంతో కష్టపడి నిర్మించారన్నారు. వారికి ఎమ్మెల్యే పేరు పేరునా ధన్యవాదాలు తెలిపి, అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో శరన్నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ పండుగలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు వాడవాడలా, వీధి వీధులా, గ్రామ గ్రామాల్లో ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంతో ఈ పండుగలో పాల్గొంటారు. ఇక్కడ దుర్గామాత విగ్రహం కూడా ఏర్పాటు చేయడంతో నవరాత్రి పూజలు కూడా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వాములు, దీక్షాపరులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA