Sirikonda: అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు: కలెక్టర్ రాజర్షి షా!

Sirikonda: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ రైతు వేదికలో మంగళవారం కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కొత్త చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 17 Nov 2026 2:30 PM IST
Sirikonda
X

Sirikonda: అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు: కలెక్టర్ రాజర్షి షా!

​సిరికొండ: ​అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను పూర్తి పారదర్శకతతో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి ఆయన లబ్ధిదారులకు కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం జిల్లావ్యాప్తంగా 14,500 కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నామని, అందులో ఒక్క సిరికొండ మండలానికే 4,500 పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. పీవీటీజీ గ్రామాల్లోని దివ్యాంగులకు ప్రత్యేక రిమ్స్ వైద్య శిబిరాలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలతో పాటు పింఛన్లు ఇచ్చామని తెలిపారు. అలాగే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కోసం నవంబర్ 19 నుంచి నాలుగు వారాలపాటు గ్రామాల్లో రేషన్ కార్డు ఆధారంగా ప్రత్యేక ఆన్‌లైన్ నమోదు శిబిరాలు నిర్వహిస్తామని, ఇందుకు సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

​ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. బోథ్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నిరుపేద ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆర్థిక భరోసానిస్తున్నాయని, అర్హులందరికీ దశలవారీగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీఆర్డీఏ అధికారి రవీందర్ రాథోడ్, తహసీల్దార్ అరవింద్, ఎంపీడీవో సంతోష్, స్థానిక సర్పంచ్ దత్తు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH