Nizamabad: రష్యా సైన్యంలో నిజామాబాద్ యువకులు.. ఎమ్మెల్యే భూపతిరెడ్డి చొరవ!

Nizamabad: రష్యా సైన్యంలో చిక్కుకున్న నలుగురు నిజామాబాద్ యువకులు స్వదేశానికి రప్పించాలని సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే భూపతిరెడ్డి లేఖ ప్రవాసీ ప్రజావాణిలో కుటుంబాల వినతి.

M. RAMESH,NIZAMABAD
Published on: 29 Sept 2026 5:25 PM IST
Nizamabad
X

Nizamabad: రష్యా సైన్యంలో నిజామాబాద్ యువకులు.. ఎమ్మెల్యే భూపతిరెడ్డి చొరవ!

నిజామాబాద్: ఉపాధి కోసం రష్యా వెళ్లి మోసపూరితంగా రష్యా సైన్యంలో చిక్కుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎమ్మెల్యే సూచన మేరకు బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్ లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.

రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలోని యుద్ధభూమిలో తమ వారు చిక్కుకున్నారని, దౌత్యపరమైన సహాయంతో సురక్షితంగా విడిపించి భారత్ కు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.బాధితులుగా భుక్యా రవీందర్ (నల్లగుట్ట తండా, మునిపల్లి, జక్రాన్ పల్లి), సిర్షు అశోక్ (ఒడ్డెర కాలనీ, పెద్ద వాల్గోట్, సిరికొండ), మెగావత్ ప్రకాష్ (చెరువు తండా, దమ్మన్నపేట, ధర్పల్లి), మహమ్మద్ అఫ్జల్ ఖాన్ (తడ్కోల్, బాన్సువాడ) లను కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందినవారు.

కుటుంబ సభ్యులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు, సీఎం ప్రజావాణి ఇన్ చార్జి గద్వాల్ విజయలక్ష్మి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ మాట్లాడాతు నలుగురికి అవసరమైన దౌత్య సహాయం అందించి సురక్షిత విడుదలకు చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

తమ కుటుంబ సభ్యుల కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, మహమ్మద్ బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD