Nizamabad: అక్రమ వడ్డీ వ్యాపారులపై నిజామాబాద్ పోలీసుల మెరుపు దాడులు
Nizamabad: అక్రమ వడ్డీ వ్యాపారులపై నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాలతో పోలీసుల మెరుపు దాడులు. 67 ప్రాంతాల్లో తనిఖీలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం.
Nizamabad: అక్రమ వడ్డీ వ్యాపారులపై నిజామాబాద్ పోలీసుల మెరుపు దాడులు
నిజామాబాద్: ప్రజలను అధిక వడ్డీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమంగా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సి పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
కమిషనరేట్ పరిధిలో మొత్తం 67 ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, నగదు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల ఇళ్లతో పాటు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి, లభించిన ఆధారాలను పరిశీలిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా సి పి. సాయి చైతన్య మాట్లాడుతూ, ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పులు తీసుకున్న వారిని వేధించడం, బలవంతంగా చెక్కులు, ఇతర పత్రాలు తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అక్రమ వడ్డీ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.అధిక వడ్డీల పేరుతో వేధింపులకు గురవుతున్న బాధితులు భయపడకుండా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమ వడ్డీ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీ.పీ సాయి చైతన్య తెలిపారు.




