Nizamabad: నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణాభివృద్ధి పనులు, తాగునీటి సరఫరాపై కలెక్టర్‌తో కలిసి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి.

K RAVI, BODHAN
Published on: 12 Nov 2026 8:18 PM IST
Nizamabad
X

Nizamabad: నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

నిజామాబాద్: బోధన్ పట్టణ అభివృద్ధి పనులపై ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన పనుల ప్రగతిని, అమృత్ పథకం, టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపడుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని, నిర్దేశిత గడువు లోపు నాణ్యతతో పూర్తి చేసేలా నిశిత పర్యవేక్షణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు.

తాగునీటి సరఫరా పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పైప్ లైన్ల మరమ్మతులు, లీకేజీలను అరికట్టడం, ట్యాంకుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని అన్నారు. బోధన్ మున్సిపల్ పట్టణం పరిధిలో కుళాయిల ద్వారా

రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నందున నీటి సరఫరా సమయాన్ని గంట పాటు కొనసాగించాలని సూచించారు. రానున్న రోజుల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అవసరమైతే వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేసేందుకు వీలుగా ప్రైవేటు బోర్లను గుర్తించాలన్నారు.

బోధన్ మున్సిపల్ కార్యాలయ నూతన భవన సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు నిర్వహణ, బయో మైనింగ్ సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఇతర ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను మైల్ స్టోన్ ప్రకారం జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని, ప్రతి స్కూల్లో.తప్పనిసరిగా తాగునీటి వసతి అందుబాటులో ఉండాలన్నారు.

సమీక్షా సమావేశంలో బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీఓ విజయ కుమారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఆర్ అండ్ బీ ఎస్.ఈ అజ్మీరా రాము, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN