Banswada: బాన్సువాడ ఆస్పత్రి నిర్లక్ష్యం: గర్భంలోనే శిశు మృతి

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే శిశువు మృతి చెందాడని బాధిత కుటుంబం సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేసింది.

SALEEM, BANSWADA
Published on: 13 Oct 2026 9:09 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడ ఆస్పత్రి నిర్లక్ష్యం: గర్భంలోనే శిశు మృతి

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. గర్భిణికి సకాలంలో వైద్యం అందించకపోవడంతో కడుపులోనే శిశువు మృతి చెందాడని బాధిత కుటుంబం ఆరోపిస్తూ ఈ రోజు సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసారు.

అసలేం జరిగింది అంటే...

బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామానికి చెందిన నాగరాణి, భర్త హరీష్ పురోహిత్ కుటుంబీకుల కథనం ప్రకారం, అక్టోబర్ 9వ తేదీన నాగరాణికి పురిటి నొప్పులు రావడం, బిడ్డ కదలికలు లేకపోవడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు పరీక్షించి బిడ్డకు హృదయ స్పందన ఉందని చెప్పి ఒక గ్లూకోస్ సీసా ఎక్కించి పంపించినట్లు బాధితులు తెలిపారు.

ఆ తర్వాత గ్రంథస్తి (మాయ) సమస్యతో బిడ్డ కదలికలు లేకపోయినా వైద్యులు పట్టించుకోలేదని, స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో వారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడ స్కానింగ్ చేసిన వైద్యులు అప్పటికే బిడ్డ మృతి చెందిందని నిర్ధారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు:

ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్యురాలుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదే రోజు అక్టోబర్ 9న విధుల్లో ఉన్న నర్సులపై కూడా చర్యలు తీసుకోవాలని మంగళవారం నాడు ఆందోళన నిర్వహించారు. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందని వారు ఆవేదన చెందారు. ఈ సందర్బంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు లిఖితపూర్వకo గా ఫిర్యాదు చేశారు.వాస్తవాలు తేలాలంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం నాటి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని కోరారు. వారి వెంట స్థానిక బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఈ విషయమై సూపరింటెండెంట్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటన జరగడం బాధాకరమని, అయితే వారు ఆసుపత్రిలో 9న వచ్చి, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారని తెలిపారు. ఆసుపత్రిలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని పేర్కొన్నారు. అయినా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామనీ వారికి హామీ ఇచ్చారు.

ఇటీవల కాలంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రిపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. గత రెండు నెలల క్రితం ఆపరేషన్ చేయడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నలుగురు బాలింతలు తీవ్రంగా అశ్వస్థత కు గురికావడం, చివరికి డయాలసిస్ చేయడం జరిగింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశం అయింది. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా వైద్యులు, సిబ్బందిలో మార్పు రావడంలేదు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA