Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ వివాదాలు, ఆరోపణల దుమారం!
Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ విబేధాలు, అధికారులపై అవినీతి ఆరోపణలు. విగ్రహాల స్క్రాప్ విక్రయాలపై దుమారం. సమగ్ర విచారణకు డిమాండ్.
Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ వివాదాలు, ఆరోపణల దుమారం!
Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ విభేదాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయనే చర్చ సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకవైపు కాంగ్రెస్ నేతలు మరోవైపు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుండటంతో మున్సిపల్ వ్యవహారాలు రాజకీయ వివాదాలకు వేదికగా మారుతున్నాయి.
మరోవైపు మున్సిపల్ చైర్మన్ భర్త, వైస్ చైర్మన్ భర్త అధికారిక పదవుల్లో లేకపోయినా మున్సిపల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉంది? అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారమే పనిచేస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇక మున్సిపల్ కమిషనర్‌పై అవినీతి ఆరోపణలు కూడా చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనులు, ఇతర అనుమతుల వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉండటంతో పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీకి చెందిన స్థలాల ఆక్రమణలు, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కట్టడాల వ్యవహారం మరో వివాదంగా మారుతోంది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన యంత్రాంగం ఆక్రమణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక వినాయక చవితి, దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జనం అనంతరం మిగిలిన స్క్రాప్ విక్రయాల వ్యవహారం కూడా వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంలో కొందరు కౌన్సిలర్లు, అధికారులు కుమ్మక్కై స్క్రాప్‌ను విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు స్క్రాప్ ఎంత మేరకు సేకరించారు? దాని విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? ఆ నిధులు మున్సిపాలిటీ ఖాతాలో జమయ్యాయా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇన్ని వివాదాలు, ఆరోపణలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది. మున్సిపల్ పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తారా? లేక రాజకీయ ఆరోపణల మధ్యే పాలన కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి.




