Banswada: సెలైన్ ఎక్కించుకుంటూనే రోగులకు వైద్యం అందించిన డాక్టర్

Banswada: బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంకితభావం చాటుకున్న డాక్టర్ శ్రీను నాయక్. తీవ్ర అనారోగ్యంలోనూ సెలైన్ ఎక్కించుకుంటూనే రోగులకు వైద్యం అందించిన వైనం.

SALEEM, BANSWADA
Published on: 24 Sept 2026 6:58 PM IST
Banswada
X

Banswada: సెలైన్ ఎక్కించుకుంటూనే రోగులకు వైద్యం అందించిన డాక్టర్

బాన్సువాడ: వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒక అద్భుతమైన మానవీయ ఘటన వెలుగుచూసింది. తన ప్రాణం కంటే రోగుల ప్రాణాలే ముఖ్యమని భావించిన, ఒక ప్రభుత్వ డాక్టర్, స్వయంగా అనారోగ్యంతో బాధపడుతూ కూడా సెలైన్ బాటిల్ తగిలించుకుని మరీ రోగులకు వైద్యం అందించారు. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం, మానవత్వం ఇప్పుడు స్థానికంగా అందరి హృదయాలను గెలుచుకుంది.

ప్రతిరోజు సుమారు వెయ్యి పైగా రోగులు

బాన్సువాడ ఏరియా ఆస్పిటల్‌కు అనునిత్యం చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 1,000 మందికి పైగా రోగులు వస్తూ, పోతుంటారు. ముఖ్యంగా అత్యవసర (ఎమర్జెన్సీ) విభాగానికి నిరంతరం పేషెంట్లు వస్తూనే ఉంటారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీను నాయక్ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కనీసం నిలబడలేని పరిస్థితి ఉన్నప్పటికీ, తానే గనుక లీవ్ పెడితే దూర ప్రాంతాల నుండి నమ్ముకుని వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడతారని ఆయన భావించారు.

సిలైన్ ఎక్కించుకుంటూనే వైద్య అత్యవసర సేవలు అందించిన ప్రభుత్వ డాక్టర్ సీను నాయక్ ను అందరూ పొగడ్తలతో ముచ్చెత్తారు.

రోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సేవలు అందకుండా పోకూడదనే ఉద్దేశంతో, డాక్టర్ శ్రీను నాయక్ ఒక చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూనే ఆసుపత్రికి వచ్చారు. తీవ్ర అస్వస్థతలోనూ తన బాధ్యతను మరిచిపోకుండా ఎమర్జెన్సీ వార్డులోని రోగులను పరీక్షించి, వారికి తగిన చికిత్స అందించారు.

ప్రశంసల జల్లు..

ఒకవైపు తానే పేషెంట్‌గా మారి సెలైన్ ఎక్కించుకుంటూ, మరోవైపు డాక్టర్‌గా మారి వందలాది మందికి ప్రాణభిక్ష పెడుతున్న శ్రీను నాయక్‌ను చూసి ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లు, వారి బంధువులు అవాక్కయ్యారు. ఆయన చూపిన మానవత్వానికి, వృత్తి ధర్మానికి అక్కడి వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

"ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరుగుతోంది అంటూ రోగులు ఆయనకు చేతులెత్తి మొక్కుతున్నారు. ప్రస్తుతం ఈ వింత ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సైతం వైరల్‌గా మారగా, జిల్లా ప్రజలు, తోటి వైద్య సిబ్బంది డాక్టర్ శ్రీను నాయక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA