Nizamabad: అమావాస్య వేళ భక్తులతో కిటకిటలాడిన జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం!

Nizamabad: ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు. అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.

K RAVI, BODHAN
Published on: 10 Oct 2026 4:20 PM IST
Nizamabad
X

Nizamabad: అమావాస్య వేళ భక్తులతో కిటకిటలాడిన జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తుల రాక ప్రారంభమైంది. ఇక్కడి ప్రసిద్ధ అష్టముఖి కోనేరులో అమావాస్య రోజున పుణ్యస్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిలక రవి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అష్టముఖి కోనేరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కోనేరు నుంచి ఆలయం వరకు రహదారుల ఇరువైపులా ఉన్న స్థలాలను చదును చేశారు. భక్తులు క్రమపద్ధతిలో ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదం అందించేందుకు ఆలయంలో మూడు చోట్ల ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో సందడిగా మారింది. జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన 40 మంది మహిళలు స్వచ్ఛందంగా భక్తులకు సేవలందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్ బాబు, ఎస్సై రమ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు చిలక రవి, ఈవో వేణు, కమిటీ సభ్యులు మోహన్ రావు, క్రాంతి, రవి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

K RAVI, BODHAN

K RAVI, BODHAN