Edapally: జానకంపేట గ్రామసభలో నిధుల వినియోగంపై గందరగోళం, నిలదీత!

Edapally: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామసభలో నిధుల వినియోగం, బిల్లులపై గ్రామస్తులు నిలదీయడంతో గందరగోళం నెలకొంది. పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

K RAVI, BODHAN
Published on: 2 Oct 2026 6:04 PM IST
Edapally
X

Edapally: జానకంపేట గ్రామసభలో నిధుల వినియోగంపై గందరగోళం, నిలదీత!

Edapally: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో పంచాయతీ నిధుల వినియోగం, బిల్లులు, చెల్లింపులపై గ్రామస్తులు ప్రశ్నించడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పంచాయతీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత సర్పంచ్, ఉపసర్పంచ్ కుటుంబీకులు, సంబంధిత వ్యక్తుల పేర్లపై బిల్లులు చెల్లించారంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. పారిశుధ్య పనులు, విద్యుత్ బల్బులు తదితర పనుల పేరుతో జరిగిన ఖర్చుల పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

గ్రామసభలో నవీన్ ట్రేడర్స్‌కు సంబంధించిన బిల్లు వ్యవహారం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. రూ.1.04 లక్షల వ్యవహారానికి రూ.1.40 లక్షల బిల్లు ఎలా చేశారంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. దీనిపై నవీన్ ట్రేడర్స్ యజమాని తనకు రూ.1.04 లక్షలు మాత్రమే అందాయని, మిగిలిన రూ.36 వేలతో తనకు సంబంధం లేదని గ్రామసభలో తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో ఆ రూ.36 వేల వ్యత్యాసం ఎలా వచ్చిందనే దానిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సహకార సంఘం అధ్యక్షుడు మిద్దె నరేందర్, మాజీ చైర్మన్ చిక్కెల లక్ష్మణ్, వార్డు సభ్యులు క్రాంతి, మురళి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ తదితరులు పంచాయతీ లెక్కలు, బిల్లులు, పనుల వివరాలపై ప్రశ్నలు లేవనెత్తారు. పంచాయతీ నిధులు ప్రజల సొమ్మని, ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు, పనుల వివరాలు, చెల్లింపుల వివరాలను గ్రామసభ ముందు ఉంచాలని కోరారు.

గతంలో పంచాయతీ నిధుల వినియోగం, ఈ-గ్రామస్వరాజ్‌లో నమోదైన చెల్లింపులు, సానిటేషన్ కిట్ల కొనుగోలు తదితర అంశాలపై ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులను కూడా గ్రామసభలో ప్రస్తావించారు. సంబంధిత రికార్డులు, వర్క్ ఆర్డర్లు, అంచనాలు, కొలతల పుస్తకాలు, బిల్లులు, వౌచర్లు, పంచాయతీ తీర్మానాలను పరిశీలించాలని గ్రామస్తులు కోరారు.

అలాగే గ్రామసభలో సర్పంచ్ అనురాధ అధ్యక్షతన సభ కొనసాగుతుండగా ఆమె భర్త కిషన్ గౌడ్ పలు అంశాలపై స్పందించడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ పరిపాలనలో కుటుంబ సభ్యుల జోక్యం, బిల్లులు, పనుల విషయంలో వారి పాత్రపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై తప్పులు నిరూపితమైతే రాజీనామా చేస్తానని కిషన్ గౌడ్ చెప్పినట్లు గ్రామసభలో చర్చ జరిగింది.

పంచాయతీ లెక్కలపై ఆడిట్ జరిగినప్పటికీ ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని గ్రామస్తులు కోరారు. బిల్లుల్లో చూపించిన పనులు వాస్తవంగా జరిగాయా? ఖర్చులు, చెల్లింపులు రికార్డులకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు.

గ్రామసభలో లేవనెత్తిన అంశాలన్నింటినీ అధికారికంగా నమోదు చేసి, పంచాయతీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, ఏవైనా అక్రమాలు లేదా నిధుల దుర్వినియోగం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. “పంచాయతీ నిధులు ప్రజల సొమ్ము.. ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి” అని వారు స్పష్టం చేశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN