Banswada: యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి – ఆర్డీఓ రవీందర్ రెడ్డి

Banswada: ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో నీటి వాడకంపై బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి హెచ్చరిక. నిజాంసాగర్, మంజీరా ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు వేయాలని సూచన.

SALEEM, BANSWADA
Published on: 23 Oct 2026 6:42 PM IST
Banswada
X

Banswada: యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి – ఆర్డీఓ రవీందర్ రెడ్డి

బాన్సువాడ: ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో, నిజాంసాగర్, మంజీరా జలాలతో పాటు చెరువుల నీటిపై ఆధారపడి సాగు చేసే రైతులు యాసంగి సీజన్‌లో నీటి వినియోగం అధికంగా ఉండే పంటలను సాగు చేయవద్దని బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) అడ్లా రవీందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యత తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని వినియోగిస్తే, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తారని తెలిపారు. నీటి వనరులను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, అధికారుల సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ఈ సందర్భంగా బాన్సువాడ, బిచ్కుంద సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో బోరుబావుల సౌకర్యం ఉన్న రైతులు కూడా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఒకటి లేదా రెండు తడులతో పండించగలిగే ఆరుతడి పంటలైన జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ, బిచ్కుంద సహాయ వ్యవసాయ సంచాలకులతో పాటు విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA