Banswada: బాన్సువాడలో రూ.56 లక్షల భారీ చోరీ కేసు ఛేదన!
Banswada: బాన్సువాడలో రూ.56 లక్షల భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్ 31.2 తులాల బంగారం, 3 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడి.
Banswada: బాన్సువాడలో రూ.56 లక్షల భారీ చోరీ కేసు ఛేదన!
బాన్సువాడ: ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.56 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని గౌలిగూడ కాలనీలో జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును బాన్సువాడ పట్టణ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.56 లక్షల విలువైన 31.2 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి ఆభరణాలు, రూ.9,700 నగదు స్వాధీనం చేసుకున్నారు.
నేరానికి ఉపయోగించిన ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ గౌలిగూడ కాలనీకి చెందిన చింతల భాస్కర్ సెప్టెంబర్ 27న మధ్యాహ్నం భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి వెళ్లారు. సాయంత్రం 6.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. పై అంతస్తులోని బెడ్‌రూమ్‌లో లాకర్‌ను తెరిచి బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఇన్వర్టర్‌ను దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో టౌన్ ఎస్‌హెచ్‌ఓ టి. శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్‌ఐ శిరీష ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుల కదలికలను గుర్తించి నిఘా పెట్టారు.
ఈ క్రమంలో అక్టోబర్ 2న విశ్వసనీయ సమాచారం మేరకు బొగ్గుగుడిసె చౌరస్తా సమీపంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, గౌలిగూడ కాలనీలో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు ఎస్పి తెలిపారు. దొంగిలించిన సొత్తును హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళ్తుండగా వారిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
నిందితులు దండుగుల మైసయ్య @ మణికంఠ (25), దండుగుల ఎల్లయ్య @ రాజు (20) బంధువులని పోలీసులు తెలిపారు. మైసయ్య బాధితుడి ఇంటి పక్కనే నివాసం ఉండటంతో వారి రాకపోకలను గమనిస్తూ ఉండేవాడని, అప్పులు తీర్చేందుకు డబ్బు అవసరం కావడంతో దొంగతనానికి పథకం వేసినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన ఇద్దరూ తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి ఆభరణాలు, నగదు దొంగిలించి ద్విచక్రవాహనంపై పరారైనట్లు తెలిపారు.
నిందితులపై గతంలోనూ కేసులు
A1 దండుగుల మైసయ్యపై గతంలో ఆరు ఇంటి దొంగతనం కేసులు నమోదయ్యాయని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వీటిలో నాలుగు బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో, రెండు గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు.
నిందితులను అరెస్ట్ చేసి బిచ్కుంద కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా పనిచేసిన డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ టి. శ్రీధర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్‌ఐ శిరీషతో ఆయన అభినందించారు.




