Nellore: మేము నామినేషన్ వెనక్కి తీసుకోలేదు.. ఏకగ్రీవాన్ని రద్దు చేయాలి!
Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు, ఎపిలగుంట ఎంపీటీసీ ఏకగ్రీవాలపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల అభ్యంతరం. నామినేషన్ ఉపసంహరించుకోకున్నా టీడీపీ గెలిచినట్లు ప్రకటించారంటూ అభ్యంతరం.
Nellore: మేము నామినేషన్ వెనక్కి తీసుకోలేదు.. ఏకగ్రీవాన్ని రద్దు చేయాలి!
Nellore: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మర్రిపాడు, ఎపిలగుంట ఎంపీటీసీ సెగ్మెంట్ ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిక్కవరం గ్రామానికి చెందిన బోయపాటి మహేశ్వరి,ఎపిలగుంట ఎంపీటీసీ సెగ్మెంట్ కొలకాని చిన్న తమ నామినేషన్ ఉపసంహరించుకోలేదని తెలిపారు.
అయినప్పటికీ ఆ సెగ్మెంట్ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడంపై వారిరువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 22న మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రాలు అందజేశామని , వాటిని స్వీకరించిన అనంతరం అధికారి సంతకంతో రసీదు కూడా ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ నెల 27న మధ్యాహ్నం ఒంటి నుంచి రెండు గంటల మధ్య వైసీపీ ఎంపీపీ అభ్యర్థి, ఇతర ఎంపీటీసీ అభ్యర్థుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తమకు ఇచ్చిన బీ-ఫారాలని రిటర్నింగ్ అధికారికి అందజేశానని మహేశ్వరి, చిన్న ఇరువురు తెలిపారు.
అనంతరం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల జాబితా విడుదల కాగా, అందులో మర్రిపాడు ఎంపీటీసీ సెగ్మెంట్, ఎపిలగుంట టీడీపీ అభ్యర్థుల పేర్లు ఉండటాన్ని ఇరువురు ప్రశ్నించారు.తాము నామినేషన్ ఉపసంహరించుకోలేదని, ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి పత్రంపైనా సంతకం చేయలేదని స్పష్టం చేశారు.
అలాంటప్పుడు తమ నామినేషన్ లు ఎలా ఉపసంహరణకు గురైందని, రిటర్నింగ్ అధికారికి అందజేసిన బీ-ఫారం ఏమైందని ప్రశ్నించారు. నామినేషన్ ఉపసంహరణ పత్రంపై తన సంతకం ఉందని చెబితే, దానిని మరోసారి పరిశీలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేసి మర్రిపాడు, ఎపిలగుంట ఎంపీటీసీ సెగ్మెంట్ లకు ఎన్నికలు నిర్వహించాలని మహేశ్వరి, కొలకాని చిన్న డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు.




