Nellore: నిమోనియాపై అవగాహనతో ప్రాణాలను కాపాడుకోవచ్చు: డా. ప్రేమ్ దీప్!

Nellore: ప్రపంచ నిమోనియా దినోత్సవం సందర్భంగా నెల్లూరు పొగతోట బిలీవ్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన సదస్సులో పల్మనాలజిస్ట్ డాక్టర్ సి. ప్రేమ్ దీప్ అవగాహన కల్పించారు.

A Praveen, Nellore
Published on: 12 Nov 2026 5:42 PM IST
Nellore
X

Nellore: నిమోనియాపై అవగాహనతో ప్రాణాలను కాపాడుకోవచ్చు: డా. ప్రేమ్ దీప్!

నెల్లూరు: ప్రపంచ నిమోనియా దినోత్సవం (వరల్డ్ నిమోనియా డే) సందర్భంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పి.ఎం.పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో గురువారం, పొగతోటలోని బిలీవ్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిమోనియా వ్యాధిపై అవగాహన సదస్సు జరిగినది.

ఈ సందర్భంగా ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ సి. ప్రేమ్ దీప్ మాట్లాడుతూ నిమోనియా వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు. నిమోనియా పై అవగాహనతో ప్రాణాలను కాపాడుకోవచ్చని, నిమోనియా అనేది ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్ అని, బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవులవల్ల ఈవ్యాధి వచ్చే అవకాశం ఉందని వివరించారు.

ముఖ్యంగా నిమోనియా వ్యాధి లక్షణాలు: దగ్గు, జ్వరం, చలిరావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, ఆయాసం, నీరసం, అలసట, చిన్నపిల్లల్లో వేగంగా శ్వాస తీసుకోవడం, పాలు తాగలేకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నపిల్లలు, 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు నిమోనియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నిమోనియా నివారణ చర్యలకు న్యుమోకాకల్ వ్యాక్సిన్, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ వంటి తగిన టీకాలు వైద్యుల సలహా మేరకు వేయించుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. పోషకాహారం తీసుకోవడం, పొగతాగడానికి దూరంగా ఉండడం కూడా ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని తెలిపారు. నిమోనియా లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందాలని, సొంత వైద్యం చేసుకోరాదని సూచించారు.

ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నప్పుడు తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు. నిమోనియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వ్యాధి నివారణ చర్యలను ప్రోత్సహించడం, సకాలంలో వైద్య సేవలు అందేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.

అనంతరం పీ.హెచ్.పీ సభ్యులు డా. సి. ప్రేమ్ దీప్, డా. ఎం. మనోజ్ కుమార్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీ.హెచ్.పి నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, నరసాపురం ప్రసాద్, ఉప్పలపాటి రామదాసు, ఎం. శ్రీధర్ రావు, పిఆర్ఓ డి.మురళి తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore