Nellore: నెల్లూరులో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనుల పరిశీలన!

Nellore: విమర్శలకు వెనక్కి తగ్గేది లేదు.. పది రెట్లు ఎక్కువగా పనిచేస్తానని స్పష్టం చేసిన మంత్రి నారాయణ, నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ పనుల పరిశీలన.

A Praveen, Nellore
Published on: 17 Sept 2026 2:43 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనుల పరిశీలన!

Nellore: నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్‌లో నిర్మాణంలో ఉన్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను రాష్ట్ర మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

నెల్లూరులో మంచి పని చేసినప్పుడు స్థానిక నాయకులు అనవసరంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి నారాయణ అన్నారు. విఆర్ హైస్కూల్‌ను అభివృద్ధి చేసిన సమయంలోనూ కొందరు విమర్శలు చేశారని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తనను డీమోరల్ చేయలేరని, విమర్శలకు పది రెట్లు ఎక్కువగా పనిచేసి ప్రజలకు మరింత సేవ చేస్తానని అన్నారు.

విఆర్ హైస్కూల్ అభివృద్ధిని రాష్ట్రంలోనే కాకుండా అమెరికా, రష్యా, సింగపూర్ తదితర దేశాల్లోని తెలుగువారు సైతం అభినందించారని మంత్రి తెలిపారు. నెల్లూరులో విఆర్ హైస్కూల్‌ను అంతర్జాతీయ పాఠశాల స్థాయిలో తీర్చిదిద్దామని చెప్పారు.

ఆర్ఎస్ఎస్ స్కూల్‌ను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మరో పాఠశాలను డీఎస్ఆర్ సుధాకర్‌రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థ దత్తత తీసుకుని అభివృద్ధి చేశాయని మంత్రి పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆయా పాఠశాలలను ప్రారంభించి, అభివృద్ధికి సహకరించిన వారిని అభినందించారని తెలిపారు.

17 పాఠశాలలకు అంతర్జాతీయ హంగులు

నెల్లూరు నగరంలోని 47, 42, 41 డివిజన్లలో పర్యటించిన సందర్భంగా మరో రెండు ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి జాబితాలో చేర్చామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఎంపిక చేసిన 15 పాఠశాలలకు వీటిని కలిపి మొత్తం 17 ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.

42, 43, 48 డివిజన్ల ప్రజల కోసం వక్ఫ్ బోర్డుకు చెందిన 5.5 ఎకరాల స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ పాఠశాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

సీఎస్ఆర్ నిధులతో పాఠశాల నిర్మాణానికి ఎంపీ సీఎం రమేష్ సోదరుల కంపెనీని కోరగా వారు వెంటనే అంగీకరించారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పూర్తయిందని, మరో పది రోజుల్లో ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తి చేస్తామని వెల్లడించారు. పాఠశాలల పునఃప్రారంభ సమయానికి నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

స్పోర్ట్స్ కాంప్లెక్స్.. స్విమ్మింగ్ పూల్

పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్య అందించడమే విద్యాశాఖ మంత్రి లోకేష్ లక్ష్యమని, ఆ లక్ష్య సాధన కోసం తాను పనిచేస్తున్నానని నారాయణ తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల కోసం వివిధ క్రీడలకు అనువైన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

పాఠశాల సమయంలో విద్యార్థులు, మిగిలిన సమయంలో సాధారణ ప్రజలు ఉపయోగించుకునేలా స్విమ్మింగ్ పూల్‌ను కూడా ఏర్పాటు చేసేలా డిజైన్ చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore