Udayagiri: వ్యవసాయ విద్యార్థులకు మల్బరీ మొక్కల పెంపకంపై అవగాహన
Udayagiri: ఉదయగిరి వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు మల్బరీ మొక్కల పెంపకం, నర్సరీ తయారీ విధానంపై పట్టు పురుగుల శాఖ అధికారుల అవగాహన కార్యక్రమం.
Udayagiri: వ్యవసాయ విద్యార్థులకు మల్బరీ మొక్కల పెంపకంపై అవగాహన
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ కళాశాలలో మల్బరీ మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.నెల్లూరు జిల్లా పట్టు పురుగుల పెంపక శాఖ ఉప సంచాలకులు ఎన్. సత్యనారాయణ, సాంకేతిక అధికారి బి. వెంకటేశ్వర రెడ్డి నాలుగో సంవత్సరం విద్యార్థులకు విక్టరీ (V-1) మల్బరీ మొక్కల పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నర్సరీ తయారీ విధానం, నీటి పారుదల, కటింగ్స్ ఎంపిక, తెగుళ్ల నివారణ తదితర సాంకేతిక అంశాలను వివరించారు.
మల్బరీ కటింగ్స్‌ను 0.2 నుంచి 0.25 శాతం మ్యాంకోజెబ్ ద్రావణంలో 6 నుంచి 8 గంటల పాటు ఉంచిన అనంతరం నర్సరీలో నాటితే వేరు కుళ్ళు, కటింగ్ కుళ్ళు, డై-బ్యాక్, డ్యాంపింగ్ ఆఫ్ వంటి శిలీంధ్ర సంబంధిత సమస్యలను నివారించవచ్చని తెలిపారు.నారుమడిని 300 సెంటీమీటర్ల పొడవు, 120 సెంటీమీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేయాలని, నేల మట్టం నుంచి 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తులో మడిని నిర్మించాలని సూచించారు.
నీరు నిల్వ ఉండకుండా మడుల చుట్టూ 25 నుంచి 30 సెంటీమీటర్ల వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతుతో కాలువలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి నారుమడికి సుమారు 20 కిలోల పశువుల ఎరువును బేస్ ట్రీట్మెంట్గా మట్టిలో కలపాలని వివరించారు.నారుమడిలో వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 సెంటీమీటర్ల దూరం పాటించాలని సూచించారు.
8 నుంచి 12 నెలల వయసున్న ఆరోగ్యకరమైన కొమ్మల నుంచి 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు, పెన్సిల్ మందంతో ఉండే కటింగ్స్‌ను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ప్రతి కటింగ్‌లో కనీసం 3 నుంచి 4 క్రియాశీల మొగ్గలు ఉండాలని, కటింగ్‌ను 45 డిగ్రీల కోణంలో కత్తిరించి నాటాలని వివరించారు.కటింగ్స్‌ను నారుమడిలో 45 డిగ్రీల వాలుగా నాటి, రెండు మొగ్గలు మట్టిలోపల, ఒక మొగ్గ మట్టి పైభాగంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు.
నాటిన వెంటనే తగినంత నీరు అందించాలని, మొదటి 10 నుంచి 15 రోజుల వరకు నేలలో తేమను బట్టి రోజూ లేదా రోజు విడిచి రోజు తేలికపాటి తడులు ఇవ్వాలని తెలిపారు. మొలకలు వచ్చిన తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలని, మడిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నారుమడిలో కటింగ్స్ నాటిన 90 నుంచి 120 రోజుల్లో మొక్కలు ప్రధాన పొలంలోకి మార్పిడి చేయడానికి అనుకూలంగా తయారవుతాయని తెలిపారు.
ఈ సమయంలో ఆరోగ్యకరమైన మొక్కలు సుమారు 90 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయని వివరించారు.కటింగ్స్ చుట్టూ నేలలో తేమ నిలిచేలా ఎండిన మల్బరీ కొమ్మలు, వరి గడ్డి లేదా ఎండుటాకులతో ఆచ్ఛాదన చేయాలని సూచించారు. నాటిన 55 నుంచి 60 రోజుల తర్వాత ఒక్కో ప్రామాణిక నారుమడికి 250 గ్రాముల యూరియాను నీటిలో కలిపి అందించడం ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించవచ్చని తెలిపారు.
ప్రధాన పొలంలోకి మొక్కలను మార్పిడి చేసే ముందు 24 గంటలకు నారుమడికి పూర్తిగా నీరు పెట్టాలని, దీంతో మట్టి మెత్తబడి వేర్లకు నష్టం కలగకుండా మొక్కలను సులభంగా పెకిలించవచ్చని వివరించారు.అదేవిధంగా మల్బరీ పట్టుపురుగుల పెంపకంలో అనుసరించాల్సిన ఆధునిక సాంకేతిక పద్ధతులను కూడా విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపికృష్ణ, కీటక శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ ఎం. కిషన్ తేజ్, నాలుగో సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




