Udayagiri: రామాపురంలో పల్లె పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
Udayagiri: ఉదయగిరి మండలం రామాపురంలో అక్టోబర్ 29న పల్లె పండుగ 3.0 కార్యక్రమం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు.
Udayagiri: రామాపురంలో పల్లె పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఈ నెల 29వ తేదీన ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం రామాపురంలో జరుగుతున్న ఏర్పాట్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఉండి మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించిన నేతలు అధికారుల నుంచి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖలకు అప్పగించిన బాధ్యతలు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.




