Udayagiri: ఉదయగిరి అభివృద్ధికి, సాగునీటి అందించడానికే మా ప్రభుత్వం

Udayagiri: వరికుంటపాడు మండలం రామాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేసి ఉదయగిరికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 29 Sept 2026 10:14 PM IST
Udayagiri
X

Udayagiri: ఉదయగిరి అభివృద్ధికి, సాగునీటి అందించడానికే మా ప్రభుత్వం

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఉదయగిరి ప్రాంతానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు.

వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్‌లో ఉండగానే ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేశారని అన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసి వెలిగొండ ఫేజ్–2 ద్వారా ఉదయగిరి నియోజకవర్గానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఉదయగిరి ప్రాంత రైతులకు సాగునీరు అందించడంతో పాటు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, సోమశిల హై లెవల్ కెనాల్‌కు సంబంధించిన పనులపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ ప్రాజెక్టులు, కాలువల ద్వారా సాగునీటి వసతులు మెరుగుపడి ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని చెప్పారు.వెలిగొండ ఫేజ్–2ను పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గానికి నీళ్లు అందించడంతో పాటు మార్కాపురం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రైతులకు నీటి భద్రత కల్పించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఉదయగిరి నియోజకవర్గానికి సాగునీరు అందితే వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేసి, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI