Rapuru: రూర్బన్ పంచాయతీగా రాపూరు.. తొలి సర్పంచి పీఠంపై ఉత్కంఠ!
Rapuru: మేజర్ పంచాయతీ నుంచి రూర్బన్ హోదా పొందిన రాపూరు తొలి సర్పంచి స్థానం ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో కూటమిలో ఆశావహుల క్యూ పెరిగింది; వైసీపీ వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది.
Rapuru: రూర్బన్ పంచాయతీగా రాపూరు.. తొలి సర్పంచి పీఠంపై ఉత్కంఠ!
Rapuru: ఒకప్పుడు సాధారణ మేజర్ పంచాయతీగా ఉన్న రాపూరు.ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు పొందిన రూర్బన్ పంచాయతీగా కొత్త అవతారం ఎత్తబోతోంది. ఇన్నాళ్లూ గ్రామీణ పాలన పరిధిలో కొనసాగిన ఈ పంచాయతీలో ఇకపై పట్టణ తరహా పరిపాలనకు అడుగులు పడనున్నాయి. హోదా మారింది.ప్రాధాన్యత పెరిగింది.అభివృద్ధిపై అంచనాలు మారాయి.మరి ఈ మారుతున్న రాపూరుకు తొలి సర్పంచిగా పట్టాభిషేకం చేసుకునేది ఎవరు.పంచాయతీ పీఠంపై జెండా ఎగురవేసేది ఏ రాజకీయ శక్తి.ఇదే ఇప్పుడు రాపూరు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మేజర్ పంచాయతీ నుంచి రూర్బన్ స్థాయికి
రాష్ట్ర ప్రభుత్వం 10 వేలకుపైగా జనాభా లేదా రూ.కోటి వార్షిక ఆదాయం కలిగిన పంచాయతీలకు రూర్బన్ పంచాయతీ హోదా కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో మేజర్ పంచాయతీగా ఉన్న రాపూరుకు ఇటీవల రూర్బన్ హోదా లభించింది. దీంతో రాపూరు పాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ఇకపై కేవలం గ్రామ పంచాయతీ స్థాయి పనులకే పరిమితం కాకుండా.పట్టణాలకు దీటుగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఏర్పడనుంది. పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలకు మరింత ప్రాధాన్యత దక్కనుంది.
అధికారాల పెరుగుదల.. అభివృద్ధికి కొత్త బాట
రూర్బన్ పంచాయతీలకు గెజిటెడ్ హోదా కలిగిన డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారి బాధ్యతలు నిర్వహించేలా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, ఇంజనీరింగ్, సాధారణ పరిపాలన వంటి విభాగాల ద్వారా పట్టణ స్థాయి సేవలను అందించాలన్నది లక్ష్యం.
అంతేకాదు.ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా సమకూరే ఆదాయంలో 50 శాతం నిధులను నేరుగా రూర్బన్ పంచాయతీలకు కేటాయించే నిర్ణయం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
అంటే రాపూరుకు ఇకపై కేవలం హోదా మాత్రమే కాదు.అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక పరిపాలన, ప్రత్యేక ప్రణాళికలు అందుబాటులోకి రానున్నాయన్నమాట.
మొత్తానికి రాపూరు రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ అభివృద్ధి ప్రయాణానికి దిశానిర్దేశం చేసేది ఎవరు.ప్రజల తరఫున పంచాయతీ పగ్గాలు చేపట్టేది ఎవరు.అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
తొలి ఎన్నిక...తొలి సర్పంచి.. భారీ పోటీ
రూర్బన్ హోదా వచ్చిన తర్వాత రాపూరు పంచాయతీలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈసారి సర్పంచి పదవికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ ఈసారి సర్పంచి స్థానం ఓసీ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
ఇది కేవలం ఒక సర్పంచి పదవి మాత్రమే కాదు.రాబోయే రోజుల్లో పట్టణ తరహా పాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీపై రాజకీయ ఆధిపత్యాన్ని సాధించే అవకాశం కూడా.
అందుకే రాపూరు సర్పంచి ఎన్నికపై స్థానిక రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. అభ్యర్థి ఎవరైనా సరే.తమ మద్దతుతో బరిలోకి దింపి గెలిపించుకోవాలన్న లక్ష్యంతో నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కూటమిలో ఆశావహుల క్యూ...పీఠం కోసం అంతర్గత కసరత్తు
ఇటీవల ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాపూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఆ ఉత్సాహం ఇంకా కొనసాగుతోంది.
ఇదే సమయంలో పంచాయతీ ఎన్నికల ప్రకటన రావడంతో కూటమి శ్రేణుల్లో మరోసారి రాజకీయ సందడి మొదలైంది.
రాపూరు సర్పంచి పదవిపై కన్నేసిన పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.పార్టీ ముఖ్య నాయకులను కలవడం.తమ రాజకీయ బలాబలాలను వివరించడం.తమకు అవకాశం కల్పించాలని కోరడం వంటి పరిణామాలు తెర వెనుక సాగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడే అసలు రాజకీయ కథ మొదలవుతోంది
ఎవరికి టికెట్ ఇవ్వాలి.ఎవరిని బరిలోకి దింపితే విజయం సాధ్యమవుతుంది.స్థానికంగా ప్రజాదరణ ఉన్న నాయకులు ఎవరు.కూటమి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అభ్యర్థి ఎవరు.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ కూటమి నాయకత్వం అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఒకవైపు ఆశావహుల ప్రయత్నాలు.మరోవైపు నాయకుల వ్యూహాలు. ఇంకోవైపు గెలుపు గుర్రం కోసం అన్వేషణ.ఇలా రాపూరు కూటమి రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.
వైసీపీ వ్యూహం ఏమిటి...సైలెంట్‌గా ఉంటుందా...సవాల్ విసురుతుందా.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ రాజకీయ వ్యూహంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పరిణామాల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.
కూటమి విజయోత్సాహంలో ఉండగా..వైసీపీ మాత్రం రాపూరు సర్పంచి ఎన్నికను ఎలా ఎదుర్కొంటుంది.బలమైన మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా.స్థానికంగా ఉన్న రాజకీయ బలాన్ని ఉపయోగించుకుంటుందా.లేక ప్రత్యర్థి అభ్యర్థి ఎంపికను బట్టి తన వ్యూహాన్ని మార్చుకుంటుందా.
ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి. కానీ రాపూరు సర్పంచి ఎన్నికలో వైసీపీ తీసుకునే నిర్ణయం కూడా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
సర్పంచి కుర్చీనా... రూర్బన్ అభివృద్ధికి తొలి అడుగా
ఇక్కడ మరో కీలకమైన అంశాన్ని కూడా విస్మరించలేం. రూర్బన్ హోదా పొందిన రాపూరుకు కాబోయే తొలి సర్పంచి బాధ్యతలు సాధారణమైనవి కావు....
పట్టణ తరహా పాలనకు మారుతున్న సమయంలో ప్రజల అవసరాలను గుర్తించడం.పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడం.తాగునీటి సరఫరాను మెరుగుపరచడం.డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడం.రహదారులు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించడం వంటి అనేక సవాళ్లు ముందున్నాయి.
అందుకే ఈసారి ప్రజలు ఎన్నుకునే సర్పంచి కేవలం రాజకీయ నాయకులు కాకుండా.రాపూరు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ప్రజాప్రతినిధిగా నిలవాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక హోదా వచ్చింది.అభివృద్ధికి కొత్త అవకాశాలు వచ్చాయి.. ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వం కోసం రాపూరు ఎదురుచూస్తోంది
రాపూరు రాజకీయాల్లో అసలు ఆట ఇప్పుడే మొదలు.
ఒకవైపు రూర్బన్ హోదాతో పెరిగిన రాపూరు ప్రాధాన్యత.మరోవైపు కోట్లాది రూపాయల అభివృద్ధి అవకాశాలపై ప్రజల్లో పెరుగుతున్న అంచనాలు.ఇంకోవైపు సర్పంచి పీఠం కోసం రాజకీయ పార్టీల వ్యూహాలు. ఇవన్నీ కలిపి ఈ ఎన్నికను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయా.లేక రాపూరు ఓటర్లు కొత్త రాజకీయ తీర్పు ఇస్తారా.
కూటమి ఆశావహుల్లో ఎవరికి అవకాశం దక్కుతుంది.వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకొస్తుంది.తొలి రూర్బన్ సర్పంచిగా ఎవరు చరిత్ర సృష్టిస్తారు.
ఇప్పటివరకు రాపూరులో రాజకీయాలు ఒక లెక్క.. రూర్బన్ హోదా తర్వాత రాజకీయాలే మరో లెక్క
పీఠం కోసం పోటీ ఒక్కటే కాదు. రాపూరు భవిష్యత్తుపై పట్టు సాధించేందుకు జరుగుతున్న రాజకీయ చదరంగం ఇది..
మరి రాపూరు రూర్బన్ పంచాయతీ తొలి సర్పంచి కిరీటం ఎవరికి దక్కుతుంది.తెరపైకి వచ్చే అభ్యర్థి ఎవరు.అంతిమంగా ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు.
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ....




