Nellore: నెల్లూరులో అభివృద్ధి ఏర్పాట్లను పరిశీలిస్తున్న యంత్రాంగం!

Nellore: నెల్లూరు జిల్లా రామాపురంలో ఈ నెల 29న 'పల్లె పండుగ 3.0' జరగనుంది. సీఎం, డిప్యూటీ సీఎం రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 26 Sept 2026 12:32 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో అభివృద్ధి ఏర్పాట్లను పరిశీలిస్తున్న యంత్రాంగం!

Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం... ఈ నెల 29వ తేదీన రాష్ట్రస్థాయి కార్యక్రమానికి వేదికగా మారబోతోంది. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రామాపురంలో పాల్గొననున్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సాధారణంగా ప్రశాంతంగా కనిపించే రామాపురం గ్రామం ఇప్పుడు రాష్ట్రస్థాయి కార్యక్రమానికి సిద్ధమవుతోంది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం, వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలు, రహదారులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులతో సమన్వయం చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన కావడంతో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసు అధికారులు భద్రతా చర్యలను సమీక్షిస్తూ వీఐపీ రూట్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సభకు వచ్చే ప్రజల ప్రవేశం, నిష్క్రమణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ, జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు కూడా కార్యక్రమ ఏర్పాట్లు, ప్రజల సమీకరణ, ఇతర అంశాలపై దృష్టి సారిస్తున్నారు.కూటమి నాయకులు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నారు.

రామాపురం వేదికగా జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు.

దీంతో రామాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లె పండుగ 3.0 సందడి కనిపిస్తోంది. ఒక చిన్న గ్రామం రాష్ట్రస్థాయి అభివృద్ధి కార్యక్రమానికి వేదికగా మారుతుండటం... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒకే వేదికపై పాల్గొనడం... రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం... ఇవన్నీ ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి.

29వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పల్లె పండుగ 3.0 కోసం రామాపురం ముస్తాబవుతోంది... రాష్ట్రస్థాయి అభివృద్ధి కార్యక్రమానికి వేదికగా సిద్ధమవుతోంది... ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాక కోసం ఎదురుచూస్తోంది.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI