Nellore: నెల్లూరు జిల్లాలో అట్టహాసంగా 'పల్లె పండుగ' వేడుకలు!
Nellore: నెల్లూరు జిల్లాలో పల్లె పండుగ 3.0 ప్రారంభం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో వెలిగొండ ఫేజ్-2 ప్రాధాన్యతను వివరించిన ఎంపీ వేమిరెడ్డి.
Nellore: నెల్లూరు జిల్లాలో అట్టహాసంగా 'పల్లె పండుగ' వేడుకలు!
Nellore: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన 'పల్లె పండుగ 3.0' ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేదికపై నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని వారికి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం వేదికపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రామాపురం వంటి మారుమూల ప్రాంతంలో ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. పల్లె పండుగ ద్వారా రూ.12 వేల కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు.
మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-2 పనులు త్వరితగతిన పూర్తయితే ఈ ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోతుందని ఎంపీ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన ప్రాధాన్యతను ఉదయగిరి, ఆత్మకూరు, మార్కాపురం, కందుకూరు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.
మౌలిక సదుపాయాలు, నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులోకి రావడం ద్వారా మెట్ట ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, రామాపురం నుంచి ప్రారంభమైన ఈ పల్లె పండుగ 3.0 ప్రతి గ్రామానికి చేరి ప్రజలకు మేలు చేకూర్చాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు.




