Nellore: పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం బంద్: కలెక్టర్ హిమాన్షు

Nellore: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు ప్రచారం నిషేధమని, స్థానికేతరులు పట్టణాన్ని వీడాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 29 Oct 2026 6:27 PM IST
Nellore
X

Nellore: పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం బంద్: కలెక్టర్ హిమాన్షు

Nellore: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నవంబర్ 1వ తేదీన జరగనున్న నేపథ్యంలో, పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల వ్యవధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1955లోని సెక్షన్ 600, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం, 1965లోని సెక్షన్ 343-C ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల వ్యవధిలో ఎన్నికల ప్రచారం నిషేధమని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనున్నందున, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారంపై నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం చేస్తున్న ప్రకటనలకు సంబంధించిన లింకులను ప్రైవేట్‌గా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ నేపథ్యంలో ప్రచార గడువు ముగిసిన వెంటనే సంబంధిత పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఓటర్లు కాని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, ఇతర వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయేలా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు.

ఈ ఆదేశాల అమలులో భాగంగా కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాల్లో బస చేస్తున్న వారి వివరాలను పోలీసులు పరిశీలించాలన్నారు. కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా వ్యక్తుల గుర్తింపు పత్రాలను పరిశీలించి, వారు సంబంధిత పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఓటర్లా కాదా అని నిర్ధారించాలన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అధికారులు, పోలీసులు కచ్చితంగా అమలు చేసి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE