Nellore: నెల్లూరు జిల్లాలో జడ్పీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
Nellore: నెల్లూరు జిల్లాలో నవంబర్ 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు 6 కేంద్రాలు, 352 టేబుళ్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించారు.
Nellore: నెల్లూరు జిల్లాలో జడ్పీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించారు.
జిల్లాలో మొత్తం 35 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 30 స్థానాలకు 103 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా మొత్తం 440 ఎంపీటీసీ స్థానాలకు గాను సీతారామపురం మండలంలో 78 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 362 స్థానాలకు ఎన్నికలు నిర్వహించినట్లు వివరించారు.
ఆరు కేంద్రాల్లో కౌంటింగ్..
ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మర్రిపాడు, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, చేజర్ల, కలువాయి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని జీవనజ్యోతి జూనియర్ కళాశాలలో కొవ్వూరు, కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల ఓట్లను లెక్కించనున్నారు.
ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాలలో సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇంజినీరింగ్ కళాశాలలో విన్జమూరు, కలిగిరి, కొండాపురం, కావలి, జలదంకి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల ఓట్లను లెక్కించనున్నారు.
గూడూరులోని ఎస్‌వీ ఆర్ట్స్ అండ్ డిగ్రీ కళాశాలలో రాపూరు, సైదాపురం, గూడూరు, చిల్లకూరు, కోట మండలాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నెల్లూరులోని వీఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీజీ స్టడీస్‌లో టీపీ గూడూరు, నెల్లూరు రూరల్, వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు, మనుబోలు మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
కౌంటింగ్ కోసం భారీ ఏర్పాట్లు..
ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు మొత్తం 352 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 386 మంది సూపర్‌వైజర్లను, 1,158 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
పటిష్ట పోలీసు బందోబస్తు..
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ విధుల కోసం మొత్తం 1,591 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. వీరిలో 8 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 83 మంది ఎస్‌ఐలు, 765 మంది కానిస్టేబుళ్లు, 700 మంది ఇతర పోలీసు సిబ్బంది (ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, ఏఆర్పీసీ) ఉన్నారు.
కౌంటింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు.




