Nellore: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నెల్లూరు చిన్నారి ఆధ్యా రెడ్డి
Nellore: నెల్లూరు చిన్నారి హన్వి శ్రీ ఆధ్యా రెడ్డి నిమిషంలో 42 చిత్రాలు గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు; కలెక్టర్ హిమాన్షు శుక్ల అభినందన.
Nellore: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నెల్లూరు చిన్నారి ఆధ్యా రెడ్డి
నెల్లూరు: నెల్లూరుకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి హన్వి శ్రీ ఆధ్యా రెడ్డి తన అసాధారణ జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆలకించి, అవగాహన చేసుకునే విశేష ప్రతిభ కలిగిన ఈ చిన్నారి కేవలం ఒక నిమిషంలో 42 చిత్రాలను గుర్తించి ఈ ఘనత సాధించింది. చిన్నారి ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు రికార్డుల్లో చోటు కల్పించింది.
ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చిన్నారి ఆధ్యా రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అందించిన మెడల్‌తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
చిన్న వయస్సులోనే ఒక నిమిషంలో 42 చిత్రాలను గుర్తించడం విశేషమని కలెక్టర్ ప్రశంసించారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.
నెల్లూరుకు చెందిన పి. రాఘవరెడ్డి మనవరాలైన ఆధ్యా రెడ్డి, డాక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి, డాక్టర్ యమునా దంపతుల కుమార్తె. ఈ సందర్భంగా చిన్నారి తల్లి డాక్టర్ యమునా మాట్లాడుతూ, చిన్నతనం నుంచే పాపలోని జ్ఞాపకశక్తిని గుర్తించి వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. పాప ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.




