Nellore: పెన్నానది తీరాన వర్షాల కోసం ప్రత్యేక సామూహిక నమాజ్

Nellore: నెల్లూరు పెన్నానది తీరాన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సామూహిక నమాజ్ నిర్వహించారు.

A Praveen, Nellore
Published on: 9 Oct 2026 8:44 PM IST
Nellore
X

Nellore: పెన్నానది తీరాన వర్షాల కోసం ప్రత్యేక సామూహిక నమాజ్

నెల్లూరు: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేట సమీపంలో పెన్నానది తీరాన ప్రత్యేక సామూహిక నమాజ్ (నమాజ్-ఏ-ఇస్తిస్కా) నిర్వహించారు. నమాజ్ లో ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని అల్లాహ్‌ను ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ఒకవైపు వర్షాభావం, మరోవైపు ఆకస్మిక భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

వర్షాలు లేక పంటలు పండక రైతులు నష్టపోతుండగా, తాగునీటి కొరత ప్రజలను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుని కరుణ అపారమైనదని, ఒక్క తల్లి ప్రేమనే కొలవలేమని, అలాంటిది డెబ్బై మంది తల్లుల ప్రేమకన్నా మిన్నగా అల్లాహ్ మానవాళిపై కరుణ చూపుతాడని పెద్దలు చెబుతుంటారని పేర్కొన్నారు. అంతటి దయామయుడైన భగవంతుడు మానవాళికి కష్టాలు కలగాలని కోరుకోడని, అందరి శ్రేయస్సునే ఆకాంక్షిస్తాడన్నారు.

ప్రకృతి సమతుల్యత దెబ్బతినడానికి పర్యావరణ కాలుష్యం, సహజ వనరుల విధ్వంసం వంటి మానవుని బాధ్యతారాహిత్య చర్యలు కూడా కారణమని, ప్రకృతి పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ ప్రార్థనలు మతాలకు అతీతంగా యావత్ మానవాళి సంక్షేమం కోసమని స్పష్టం చేశారు. ఏ రైతూ వర్షాలు లేక కన్నీరు పెట్టుకోకూడదని, ఏ కుటుంబమూ తాగునీటి కోసం అల్లాడకూడదని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలన్నదే ఈ ప్రార్థనల ఉద్దేశమన్నారు.

తెలిసీ తెలియక చేసిన తప్పులకు బాధ్యత వహించి, వాటిని సరిదిద్దుకుంటూ క్షమాపణ కోరాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవాళిని రక్షించి వీలైనంత త్వరగా సమృద్ధిగా వర్షాలు కురిపించాలని అల్లాహ్‌ను వేడుకున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర ప్రార్థనలో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొంటూ, ప్రత్యేక నమాజ్ ఏర్పాటు చేసిన మౌలానా ఇలియాస్‌కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులందరినీ అభినందించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore