Nellore: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యం: ఎస్పీ అజిత!
Nellore: నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు సమగ్ర భద్రతా ప్రణాళిక సిద్ధం చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు.
Nellore: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యం: ఎస్పీ అజిత!
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ఓటర్లకు భరోసా కల్పించడమే లక్ష్యంగా పటిష్టమైన చర్యలు చేపట్టింది.
"ఎన్నికల భద్రతా ఏర్పాట్లు"
నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు విస్తృత పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ఎంసీసీ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశాం.
తక్షణ స్పందన కోసం రూట్ మొబైల్ బృందాలను అందుబాటులో ఉంచాం. అక్రమ నగదు, ఇతర వస్తువుల రవాణాను అరికట్టేందుకు అంతర్జిల్లా, అంతర్గత చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం.
ఎన్నికల భద్రతను బలోపేతం చేసేందుకు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు బైండోవర్ చర్యలు చేపడుతున్నాం.
అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి, అల్లర్ల నియంత్రణ పరికరాలను సిద్ధంగా ఉంచాం... ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకుని భద్రపరిచాం.
పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం.
"హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు"
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడం, అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడం, హింసకు పాల్పడడం వంటి చర్యలను సహించేది లేదు... రాళ్లదాడులు, కర్రలతో దాడులు, వాహనాలకు నిప్పంటించడం, ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడులు, నామినేషన్ పత్రాలను లాక్కోవడం లేదా చించివేయడం వంటి ఘటనల్లో పాల్గొన్న వారిని ఆధారాల ఆధారంగా గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
హింసను ప్రేరేపించే వారు, ఘటనలకు నాయకత్వం వహించే వారు, ఇతరులను రెచ్చగొట్టే వారిపై కూడా ఆధారాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం... ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేయడం లేదా వారి విధులకు ఆటంకం కలిగించడం తీవ్రమైన నేరం. అటువంటి వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 132తో పాటు వర్తించే ఇతర చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల నేరాల స్వభావాన్ని బట్టి భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, ఇతర వర్తించే చట్టాల ప్రకారం చర్యలు చేపడతాం.. గతంలో ఎన్నికల హింసకు పాల్పడినవారు, ప్రస్తుత ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై చట్టప్రకారం ముందస్తు చర్యలు తీసుకుంటాం.
సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ప్రజలకు అవసరమైన రక్షణ కల్పిస్తాం.
"ఎన్నికల సంబంధిత నేరాలపై చట్టపరమైన చర్యలు"
ఎన్నికల సందర్భంగా నేరాల స్వభావాన్ని బట్టి భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
సెక్షన్లు 115(2), 118(1): స్వచ్ఛందంగా గాయపరచడం, ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడం.
సెక్షన్ 126(2): అక్రమంగా నిరోధించడం.
సెక్షన్ 132: ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకునే ఉద్దేశంతో దాడి చేయడం లేదా నేరపూరిత బలప్రయోగం.
సెక్షన్లు 189, 190, 191(2): అక్రమ సమూహం, ఆ సమూహంలోని సభ్యుల బాధ్యత, అల్లర్లు.
సెక్షన్ 174: ఎన్నికల్లో అనుచిత ప్రభావం చూపడం.
సెక్షన్ 223: చట్టబద్ధంగా ప్రకటించిన ప్రభుత్వ అధికారి ఆదేశాలను ఉల్లంఘించడం.
సెక్షన్లు 324, 329: ఆస్తికి నష్టం కలిగించడం, నేరపూరితంగా అక్రమ ప్రవేశం. అవసరాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 227, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 170తో పాటు వర్తించే ప్రత్యేక, స్థానిక చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం.
"జిల్లా ఎస్పీ స్పష్టమైన హెచ్చరికలు"
హింస, ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం, పోలీసులపై దాడులు, నామినేషన్ పత్రాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిని వీడియోలు, సీసీటీవీ దృశ్యాలు, ఫొటోల ఆధారంగా గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
హింసాత్మక ఘటనలను నిర్వహించడం, నాయకత్వం వహించడం, ఇతరులను రెచ్చగొట్టడం లేదా ప్రేరేపించడం వంటి చర్యల్లో ప్రమేయం ఉన్న వారిపై ఆధారాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికలకు సంబంధించిన సమావేశాల వద్ద ఆయుధాలతో రావడం, బారికేడ్లను దాటడం, రహదారులను దిగ్బంధించడం, పోలీసుల చట్టబద్ధ ఆదేశాలను ధిక్కరించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తాం.
గతంలో ఎన్నికల హింసకు పాల్పడినవారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు బైండోవర్ చర్యలు చేపడతాం. నిబంధనలకు అనుగుణంగా హిస్టరీ షీట్లు తెరుస్తాం.
సమస్యాత్మక నామినేషన్ కేంద్రాలు, గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి, అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ప్రజలకు తగిన రక్షణ కల్పిస్తాం. ఎన్నికల సమయంలో బెదిరింపులు, అడ్డంకులు, హింసాత్మక ఘటనలు ఎదురైతే ప్రజలు వెంటనే 100 లేదా 112కు ఫోన్ చేయాలి లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.




