Nellore: గిరిజనుల అభివృద్ధికి రూ.750 కోట్లతో ప్రణాళిక

Nellore: నెల్లూరులో ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం. రానున్న ఐదేళ్లలో రూ.750 కోట్లతో గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికలు. సర్పల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెల్లడి.

V. Narasimhulu, Nellore
Published on: 21 Sept 2026 9:03 PM IST
Nellore
X

Nellore: గిరిజనుల అభివృద్ధికి రూ.750 కోట్లతో ప్రణాళిక

నెల్లూరు: గిరిజనుల విద్యా, వైద్య, ఆరోగ్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దశలవారీగా రూ.750 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు.

నెల్లూరులో సోమవారం 11వ గవర్నింగ్ బాడీ సమావేశం పివో, ఐటిడిఎ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన 23 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో దశలవారీగా సుమారు రూ.750 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో రహదారులు, గృహాలు, ఇతర ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న లోటుపాట్లను గుర్తించి పరిష్కరించడంతో పాటు గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో 100 శాతం విద్యార్థుల నమోదు లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పదో తరగతి అనంతరం విద్యార్థుల విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక డేటాబేస్ రూపొందించి, ఉన్నత విద్య, వృత్తి విద్య, నైపుణ్య శిక్షణ ద్వారా వారు స్థిరపడే వరకు మార్గనిర్దేశం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఉపాధి లేని యానాది యువతను గుర్తించి ఆధునిక రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు దశలవారీగా సుమారు రూ.కోటి కేటాయించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మత్స్య, వ్యవసాయ, ఉద్యానవన తదితర రంగాల్లో స్థానికంగా జీవనోపాధి అవకాశాలు కల్పించి గిరిజనుల వలసలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలో ఆధార్ లేని గిరిజనులను గుర్తించి ఇప్పటికే 15 వేల మందికి పైగా ఆధార్ సేవలు అందించామని, మిగిలిన వారికి కూడా ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఆధార్ అందేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలతో పాటు CSR, PPP, వివిధ శాఖల నిధుల కన్వర్జెన్స్ ద్వారా అదనపు వనరులను సమీకరించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు.

షెడ్యూల్డ్ ఏరియాలతో సమానంగా ప్లెయిన్ ఏరియాల్లో నివసిస్తున్న చెంచు, యానాది, ఎరుకల తదితర గిరిజన సముదాయాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. విద్య, మౌలిక వసతులు, ఉపాధి, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను సమగ్రంగా తీసుకుని కాలపరిమితితో కార్యక్రమాలను అమలు చేయాలని గవర్నింగ్ బాడీ సమావేశంలో నిర్ణయించినట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఐటీడీఏ పరిధిలోని 92 గురుకుల పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రవేశాలు కల్పించడంతో పాటు పదో తరగతిలో 97 శాతం ఉత్తీర్ణత సాధించడం, 259 మంది విద్యార్థులు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, జేఈఈ మెయిన్స్‌కు అర్హత సాధించడం సంతోషకరమన్నారు. గిరిజనుల విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధికి రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాలకు రూ.750 కోట్ల నిధులు కేటాయించాలని గవర్నింగ్ బాడీ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.

గిరిజనుల భూముల పరిరక్షణకు, ఆధార్ కార్డుల జారీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నెల్లూరు ఐటీడీఏకు షెడ్యూల్డ్ ఏరియా ప్రయోజనాలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గిరిజన కాలనీల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల సీఎస్ఆర్ నిధులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని, ఐటీడీఏ సమావేశాలను ఆరు నెలలకు ఒకసారి నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో పివో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore