Rapur: రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై రాజకీయ చర్చ!

Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచగా, వైసీపీ అభ్యర్థి ఎంపికపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

Yellayya, Nellore
Published on: 15 Nov 2026 2:20 PM IST
Rapur
X

Rapur: రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై రాజకీయ చర్చ!

రాపూరు: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు కూటమి పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతూ సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తుండగా.. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా మౌనంగానే ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

ఒకప్పుడు వైసీపీకి బలమైన కంచుకోటగా పేరొందిన రాపూరు మేజర్ పంచాయతీలో నేడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయంలోనూ ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి దారితీస్తోంది. కూటమి అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని వైసీపీ బరిలోకి దించుతుందా..లేక అసలు పోటీకి దూరంగా ఉంటుందా..అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

కంచుకోటలో కదలికలేవీ

గతంలో రాపూరు మేజర్ పంచాయతీలో వైసీపీకి గట్టి రాజకీయ పట్టు ఉండేది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుత ఎన్నికల వేళ మాత్రం ఆ స్థాయిలో రాజకీయ సందడి కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనకపోవడం, అభ్యర్థి ఎంపికపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం పార్టీ బలహీనతకు సంకేతమా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నాయకత్వ లోపమా సమన్వయ లోపమా

రాపూరులో వైసీపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. మండల స్థాయి నాయకుల మధ్య సమన్వయ లోపమా.. లేక నియోజకవర్గ సమన్వయకర్త నాయకత్వంలో లోపమా.. అన్న ప్రశ్నలు పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బలంగా ఉన్న పార్టీ నేడు ఎన్నికల బరిలోనే తన ఉనికిని చాటుకోలేని పరిస్థితికి ఎందుకు చేరుకుందన్న చర్చ జోరందుకుంది.

కూటమి జోరు.. వైసీపీ మౌనం

కూటమి పార్టీ మాత్రం సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ముందస్తు వ్యూహాలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. వైసీపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో రాజకీయ కదలికలు కనిపించకపోవడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మొత్తానికి రాపూరు మేజర్ పంచాయతీలో వైసీపీ పోటీ చేస్తుందా..అభ్యర్థిని ప్రకటించి కూటమికి సవాల్ విసురుతుందా.. లేక ఎన్నికల బరిలోకి దిగకుండానే వెనక్కి తగ్గుతుందా..అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా నిలిచిన రాపూరులో నేడు ఆ పార్టీ మౌనం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. సర్పంచ్ ఎన్నికల నాటికి వైసీపీ తన వ్యూహాన్ని ప్రకటిస్తుందా. లేక కూటమికి ఏకపక్ష అవకాశాన్ని కల్పిస్తుందా..అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. రాపూరు సర్పంచ్ ఎన్నికల పోరులో అసలు వైసీపీ ఉంటుందా..ఉంటే ఎవరు బరిలోకి దిగుతారు..ఇదే ఇప్పుడు రాపూరు రాజకీయాల్లో హాట్ టాపిక్.

Yellayya, Nellore

Yellayya, Nellore