Nellore: గ్రామాభివృద్ధి కోసం పంచాయతీల ఏకగ్రీవాలకు సహకరించండి!

Nellore: గ్రామాభివృద్ధి కోసం పంచాయతీల ఏకగ్రీవాలకు సహకరించాలని నెల్లూరు డీసీసీబీ చైర్మన్ మెటుకూరు ధనుంజయ రెడ్డి పిలుపునిచ్చారు. రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల ప్రోత్సాహకం ఉంటుందన్నారు.

Yellayya, Nellore
Published on: 15 Nov 2026 5:44 PM IST
Nellore
X

Nellore: గ్రామాభివృద్ధి కోసం పంచాయతీల ఏకగ్రీవాలకు సహకరించండి!

నెల్లూరు: గ్రామాల అభివృద్ధి, పల్లెల్లో ప్రశాంతమైన పాలన లక్ష్యంగా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, రాపూరు, కలువాయి మండలాల ఇంచార్జ్ మెటుకూరు ధనుంజయ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

తెలిపారు. 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని, రాజకీయ పట్టింపులకు పోకుండా గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఏకగ్రీవాలకు సహకరించాలని కోరారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో తమ నాయకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఆసక్తి ఉన్నవారే పోటీలో నిలవాలని సూచించామని తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో జరిగిన వేదింపులు, కక్షసాధింపులు, అక్రమ సంపాదనతో విచ్చలవిడిగా ఖర్చు చేసే పరిస్థితుల నేపథ్యంలో నాయకులు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎవరిని పోటీకి బలవంతం చేయలేదన్నారు.

ఆ సమయంలో అనేక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షలు చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే ప్రతి రూపాయిని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తోందని, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన ప్రోత్సాహకాలను సైతం వెంటనే విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి వినియోగించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికల సమయంలో పోరాటాలకు పోయి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, అపహాస్యపాలవడం, రాజకీయ వేధింపులతో గొడవలకు దిగడం వంటి పరిణామాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే గ్రామాల భవిష్యత్తుకు ప్రాధాన్యమిస్తూ ఏకగ్రీవ ఎన్నికలకు అందరూ సహకరించాలని మెటుకూరు ధనుంజయ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Yellayya, Nellore

Yellayya, Nellore