Nellore: మంత్రి నారాయణపై అసత్య ప్రచారాలు ఖండించిన వీర మహిళలు!

Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల వేళ కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని, మంత్రి నారాయణ తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని జనసేన అభ్యర్థులు స్పష్టం చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 25 Oct 2026 10:47 PM IST
Nellore
X

Nellore: మంత్రి నారాయణపై అసత్య ప్రచారాలు ఖండించిన వీర మహిళలు!

నెల్లూరు: ఎన్నికల వేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య విభేదాలు స్ట్రస్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని జనసేన మహిళా అభ్యర్థులు ఖండించారు. మంత్రి నారాయణపై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తూ కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కూటమి అభ్యర్థుల విజయానికి మంత్రి నారాయణతో పాటు టీడీపీ శ్రేణులు పూర్తి సహకారం అందిస్తున్నాయని స్పష్టం చేశారు.

జేమ్స్ గార్డెన్ లోని రూప్ కుమార్ కార్యాలయంలో ఆదివారం వీర మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు.నెల్లూరు కార్పొరేషన్‌లోని 71వ డివిజన్‌ జనసేన అభ్యర్థి అలియా మాట్లాడుతూ, కూటమి పొత్తులో భాగంగా జనసేనకు చెందిన ముగ్గురు మహిళలకు కార్పొరేటర్లుగా పోటీ చేసే అవకాశం కల్పించారన్నారు. మంత్రి నారాయణ ఆదేశాలతో టీడీపీ క్యాడర్‌ తమ గెలుపు కోసం కష్టపడుతోందని తెలిపారు.

జనసేన పోటీ చేస్తున్న డివిజన్లలోనూ మంత్రి అన్ని విధాలా సహకరిస్తున్నారని చెప్పారు. నారాయణ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో, మంత్రి నారాయణ సహకారంతో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నామన్నారు.

21వ డివిజన్‌ జనసేన అభ్యర్థి గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతూ, జనసేనకు ఓటు వేయొద్దని మంత్రి నారాయణ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంత్రి చేసిన అభివృద్ధి తమ ప్రచారానికి బలంగా మారిందని తెలిపారు. మంత్రి సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, షరణి సైతం కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు .15వ డివిజన్‌ జనసేన అభ్యర్థి కెజియా కుమారి మాట్లాడుతూ, మంత్రి నారాయణకు ప్రజల్లో ఉన్న మంచి పేరు తమకు ప్రచారంలో ఆదరణ తెచ్చిపెడుతోందన్నారు. మంత్రి తమకు గుర్తింపు, గౌరవం ఇస్తూ సహకరిస్తున్నారని చెప్పారు. దుష్ప్రచారాలను నమ్మకుండా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE