Nellore: డబ్బు, అధికారం, బెదిరింపులతోనే కూటమి గెలుపు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అక్రమాలకు పాల్పడిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా.

V. Narasimhulu, Nellore
Published on: 4 Nov 2026 9:52 PM IST
Nellore
X

Nellore: డబ్బు, అధికారం, బెదిరింపులతోనే కూటమి గెలుపు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీ కూటమి డబ్బు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి. చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రక్రియలో అడుగడుగునా అధికార దుర్వినియోగం జరిగిందని, ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్ని కుతంత్రాలకు దిగారని ఆయన మండిపడ్డారు.

నెల్లూరు సిటీలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కానీ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశమే లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేసారు. ఐదేళ్లపాటు ప్రజల మధ్య ఉండి సేవ చేసిన అభ్యర్థులను నామినేషన్ దశలోనే వివిధ కారణాలు చూపించి అనర్హులుగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి ఎన్ని బెదిరింపులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి అయినా వారి దగ్గరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, వారి కోసం ఎంతవరకైనా పోరాడుతానని హామీ ఇచ్చారు.

రెండేళ్ల తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో ఉన్న గౌరవప్రదమైన రాజకీయ వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore