Nellore: వర్షాలు విస్తారంగా కురవాలి: వరుణ యాగంలో మంత్రి నారాయణ
Nellore: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని కోరుతూ నెల్లూరు మూలాపేట శ్రీకృష్ణ ధర్మరాజుల ఆలయంలో మంత్రి పొంగూరు నారాయణ వరుణ యాగంలో పాల్గొన్నారు.
Nellore: వర్షాలు విస్తారంగా కురవాలి: వరుణ యాగంలో మంత్రి నారాయణ
నెల్లూరు: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి జలాశయాలు నిండాలని, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. నెల్లూరు సిటీ మూలాపేటలోని శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగంలో మంత్రి నారాయణ తన కుమార్తె షరణితో కలిసి పాల్గొన్నారు.
యాగంలో పూర్ణాహుతి సమర్పించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. సాధారణంతో పోలిస్తే వర్షపాతం 54 శాతం తక్కువగా నమోదైందని చెప్పారు.ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్రలో పరిస్థితి కొంత మెరుగుపడిందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు సాగు చేసుకునేందుకు అవసరమైన నీరు అందుబాటులోకి రావాలని, ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండాలని ప్రార్థించానన్నారు.రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జనార్దన్, ఈవో జానకి, ఆలయ చైర్మన్ వేలూరు పెంచలరాజు, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, డివిజన్ టీడీపీ నేతలు గండవరం నాని, అన్నంగి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




