Nellore: నెల్లూరులో 'పల్లె పండుగ 3.0' ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష
Nellore: నెల్లూరులో పల్లె పండుగ 3.0 ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష. ఈ నెల 29న ఉదయగిరికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Nellore: నెల్లూరులో 'పల్లె పండుగ 3.0' ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష
నెల్లూరు: గ్రామాల సర్వతోముఖాభివృద్ధే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, టీడీపీ అబ్జర్వర్ గురవా రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఆర్డీఓ అనూషా తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేయడమే పల్లె పండుగ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, పశువుల షెడ్లు, వ్యవసాయ కుంటలు, నీటి తొట్టెలు తదితర మౌలిక వసతులను గ్రామాల్లో ఒకేసారి చేపట్టేందుకు పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పల్లె పండుగ 1.0, 2.0, 3.0 కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. పల్లె పండుగ 1.0ను 2024 అక్టోబర్ 14న ₹4,500 కోట్లతో ప్రారంభించగా, మెజారిటీ పనులు పూర్తయ్యాయని చెప్పారు. పల్లె పండుగ 2.0ను 2025 నవంబర్ 26న ₹6,787 కోట్లతో ప్రారంభించి, మెజారిటీ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం పల్లె పండుగ 3.0లో భాగంగా ₹11,085 కోట్లతో గ్రామాల్లో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మినీ గోకులాలు, ఉద్యాన పంటల కాంపౌండ్లు, మ్యాజిక్ డ్రైన్లు, బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
పల్లె పండుగ 3.0కు ఉదయగిరిని వేదికగా ఎంపిక చేయడానికి అక్కడి భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వసతులు ప్రధాన కారణాలని మంత్రి తెలిపారు. ఉదయగిరి ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో నీటిని తీసుకురావడానికి లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు నీరు అందేలా చర్యలు చేపట్టినట్లు, మిగిలిన మండలాలకు కూడా నీటిని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు.
ఈ నెల 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉదయగిరికి చేరుకుని పల్లె పండుగ 1.0, 2.0లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారని మంత్రి తెలిపారు. అనంతరం పల్లె పండుగ 3.0లో మంజూరైన పనులకు శంకుస్థాపన చేసి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాట్లు పూర్తయ్యాయని, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.




