Nellore: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి నారాయణ

Nellore: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ అవకాశం.

A Praveen, Nellore
Published on: 9 Oct 2026 8:51 PM IST
Nellore
X

Nellore: స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి నారాయణ

నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం అవకాశాలు కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. కోర్టు తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.

ఎన్నికల ప్రక్రియకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని, నిర్ణయించిన సమయంలోగా స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.

ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు

స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం వైఎస్సార్‌సీపీకి ఇష్టం లేదని మంత్రి విమర్శించారు. ఎన్నికలు జరిగితే 123 మున్సిపాలిటీల్లో కూటమి గెలుస్తుందనే భయంతోనే ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో ఎన్నికలను నిలిపివేయాలని చూశారని, 16వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఎన్నికలను అడ్డుకోవాలన్న ప్రయత్నాలు ఫలించలేదని వ్యాఖ్యానించారు.

నిధులు కోల్పోయే పరిస్థితి రాకూడదనే..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో 23 మున్సిపాలిటీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎదురైన పరిస్థితి మళ్లీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు.

కోర్టు తీర్పును అధ్యయనం చేసిన అనంతరం ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు.

A Praveen, Nellore

A Praveen, Nellore