Nellore: నెల్లూరులో ₹2.80 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి నారాయణ
Nellore: నెల్లూరులో రూ.2.80 కోట్లతో సచివాలయ భవనాలు, గ్రీనరీ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు; జూన్ 12 నాటికి యూజీడీ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.
Nellore: నెల్లూరులో ₹2.80 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి నారాయణ
నెల్లూరు: నెల్లూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మరో రూ.2.80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. నగరంలోని 11వ, 10వ, 45వ డివిజన్లలో సచివాలయ భవన నిర్మాణాలు, పార్కు ప్రహరీ గోడ, గ్రీనరీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో రూ.కోటి వ్యయంతో సచివాలయ భవన నిర్మాణానికి, పార్కు స్థలానికి రూ.30 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాయపుపాలెం ప్రాథమిక పాఠశాలను పరిశీలించి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
అనంతరం 10వ డివిజన్ ఎన్‌డీఆర్ లేఅవుట్ వద్ద రూ.70 లక్షలతో సచివాలయ భవన నిర్మాణానికి, 45వ డివిజన్ మినీ బైపాస్‌లో రూ.80 లక్షలతో గ్రీనరీ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ.50 వేల కోట్ల నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.
*భూగర్భ డ్రైనేజీ పనులకు ప్రాధాన్యత*
నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులను వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. భూగర్భ డ్రైనేజీ కనెక్షన్ల కోసం ప్రభుత్వం రూ.61 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య, మౌలిక సదుపాయాలు అందించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
*ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు చర్యలు*
వచ్చే విద్యా సంవత్సరం నాటికి నెల్లూరు నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను విఆర్‌సీ తరహాలో అభివృద్ధి చేసి, ఆధునిక సదుపాయాలతో సిద్ధం చేస్తామని మంత్రి తెలిపారు. యువనేత నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ ఎస్‌ఈ జానీ, అదనపు కమిషనర్ హిమబిందు, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి, డివిజన్ల నాయకులు నాగేంద్ర, బాలకృష్ణ, తిరుమల నాయుడు, పోకల రవి, సుజన్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




