Nellore: పోలీసులు అధికార పార్టీ ప్రైవేట్ సైన్యంగా మారారు

Nellore: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణ. పలు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్.

V. Narasimhulu, Nellore
Published on: 6 Nov 2026 6:22 PM IST
Nellore
X

Nellore: పోలీసులు అధికార పార్టీ ప్రైవేట్ సైన్యంగా మారారు

నెల్లూరు: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల తరహాలోనే నిన్న ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో అరాచకాలు, అక్రమాలకు పాల్పడి అధికార దుర్వినియోగానికి ఒడిగట్టిందని నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రజల మద్దతు లేని అధికార పక్షం ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులూ ఒడ్డి పోలీసు యంత్రాంగాన్ని తమ ప్రైవేట్ సైన్యంగా వాడుకుందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి ఎన్నికల్లో అధికార పార్టీతో కాకుండా, అంతా తామై వ్యవహరించిన పోలీసు వ్యవస్థతోనే పోరాడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని, వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను అక్రమంగా నిర్బంధించి, కనీసం ఓటు హక్కు కూడా వినియోగించుకోకుండా స్టేషన్లలో బంధించారని మండిపడ్డారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూతుల్లోకి చొరబడి వైయస్సార్సీపీ ఏజెంట్లను నెట్టివేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆధారాలతో సహా ఎత్తిచూపారు. ఈ మొత్తం ఉదంతాలపై జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి నిష్పక్షపాత విచారణ జరపాలని, నిబంధనలు ఉల్లంఘించిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రద్దు చేసి తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేశారు.

నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడింది అధికార పార్టీతో కాదు.. సర్వస్వం తామై నిలిచిన పోలీసు వ్యవస్థతో, అధికారులతోనే పోరాడాం. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఆదరణ లేదు. వైఎస్సార్‌సీపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక పోలీసులను అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ అంటూ కంటితుడుపు చర్యలు చేపట్టి, జిల్లా అధికార యంత్రాంగం అంతా సజావుగా జరిగిందంటూ నాటకమాడిందని చెప్పారు.

ముందురోజు సాయంత్రం ఎన్నికల అధికారుల వద్ద ధ్రువీకరణ పత్రాలు తీసుకుని బ్యాడ్జీలు తెచ్చుకున్న తమ పోలింగ్ ఏజెంట్ల వివరాలు సేకరించి, రాత్రికి రాత్రే వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారని, ఏదో అంతర్జాతీయ ఉగ్రవాదులను తరలించినట్లు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మారుస్తూ భయభ్రాంతులకు గురిచేశారని, ఏజెంట్ల ఫోన్లు లాక్కుని, ఎవరికైనా చెబితే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు... పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ,స్టేషన్లలో అక్రమంగా కూర్చోబెట్టి కనీసం ఓటు కూడా వేయనీయలేదని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని అన్నారు...

ఈ నేపధ్యంలో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సాగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాకాణి గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు. అవసరమైతే ఎన్నికలను మరో రోజు నిర్వహించి, సాయంత్రం నుంచి కౌంటింగ్‌ పూర్తి చేయాలన్నారు. లేదంటే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని తేల్చి చెప్పారు. మరోవైపు ఎన్ని బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులు ఎదురైనా ప్రాణాలకు తెగించి పోరాడిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore