Nellore: నెల్లూరు రూరల్‌లో వైసీపీకి బోణీ లేదు కూటమికి చారిత్రాత్మక విజయం!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ ఘనవిజయం.

A Praveen, Nellore
Published on: 6 Nov 2026 12:36 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్‌లో వైసీపీకి బోణీ లేదు కూటమికి చారిత్రాత్మక విజయం!

Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి పార్టీలు చారిత్రాత్మక విజయం సాధించాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నగర మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క డివిజన్‌లో కూడా విజయం సాధించలేకపోయిందని, ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌కు ప్రజలు రికార్డు స్థాయి మెజారిటీ అందించి అఖండ విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు.

రూరల్ నియోజకవర్గంలో రూ.966 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు కూటమికి ఆశీర్వాదం అందించారని పేర్కొన్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి అనం విజయకుమార్ రెడ్డి తన సొంత డివిజన్‌లో సైతం విజయం సాధించలేకపోవడం ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోందన్నారు.

ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని, రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమేనని స్పష్టం చేశారు. ఇకపై పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని నగర అభివృద్ధికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

తాము దౌర్జన్యాలకు పాల్పడితే అనంతపురం, నాయుడుపేట ప్రాంతాల్లో ఎందుకు ఓటమి ఎదురవుతుందని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. వైసీపీ నేతలు తమ మేయర్ అభ్యర్థి అనం విజయకుమార్ రెడ్డి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలని, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సహా నాయకులందరూ విజయకుమార్ రెడ్డి పనితీరును గమనించాలని వ్యాఖ్యానించారు.

ఎన్నికల నిర్వహణలో అధికారులు తమ విధులను సమర్థంగా నిర్వహించారని, ప్రజల తీర్పును గౌరవించారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే ఎన్నికల నిర్వహణ తీరును అభినందిస్తున్న తరుణంలో ఓటమి పాలైన వారు విమర్శలు చేయడం సరికాదన్నారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: మేయర్ రూప్ కుమార్ యాదవ్

నెల్లూరు నగర మేయర్‌గా తనకు అఖండ మెజారిటీ అందించిన నగర ప్రజలకు, విజయానికి కృషి చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించిన సహాయ సహకారాలు, నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు చేసిన మంచి పనులే తన విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని, నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మేయర్ రూప్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

A Praveen, Nellore

A Praveen, Nellore