Nellore: రైతు బజార్లలో కిలో రూ.35కే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయం
Nellore: నెల్లూరు జిల్లా రైతు బజార్లలో కిలో రూ.35కే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలు ప్రారంభం. ఫత్తేఖాన్‌పేటలో విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన జేసీ వెంకటేశ్వర్లు.
Nellore: రైతు బజార్లలో కిలో రూ.35కే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయం
నెల్లూరు: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలోని ఐదు రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు.
సోమవారం నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్‌పేట రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన సబ్సిడీ ఉల్లిపాయల విక్రయ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ధరల నియంత్రణతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకు ఉల్లిపాయలు అందించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు.
జిల్లాలోని ఐదు రైతు బజార్ల ద్వారా ఒక్కొక్క వినియోగదారునికి గుర్తింపు కార్డు ఆధారంగా కిలో రూ.35 చొప్పున రెండు కిలోల ఉల్లిపాయలను సబ్సిడీ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లో ధరల పెరుగుదల వల్ల ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించిందన్నారు.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడి అనిత తదితరులు పాల్గొన్నారు.




