Vinjamur: వింజమూరు మండలంలో స్వర్ణ సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తం!
Vinjamur: నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో స్వర్ణ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Vinjamur: వింజమూరు మండలంలో స్వర్ణ సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తం!
వింజమూరు: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్వర్ణ సచివాలయ వ్యవస్థ వింజమూరు మండలంలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సిబ్బంది కొరత,విధుల నిర్వహణలో పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివిధ ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు,సంక్షేమ పథకాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం సచివాలయాలకు వస్తున్న ప్రజలకు సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. కార్యాలయాలకు వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూసినా సంబంధిత ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.
సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? ప్రజలకు సేవలు నిర్ణీత సమయంలో అందుతున్నాయా అనే అంశాలపై ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో సచివాలయాల పనితీరును మెరుగుపరిచి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సమస్యలపై స్పందించిన ఎంపీడీఓ
ఈ అంశంపై వింజమూరు మండల ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా,ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వర్ణ సచివాలయ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ప్రజల సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమేనని తెలిపారు. సిబ్బంది కొరత,పర్యవేక్షణ లోపం వంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రతి రోజు సచివాలయాల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించి, సిబ్బందికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తామని ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన సచివాలయ వ్యవస్థలో నెలకొన్న సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో వేచి చూడాల్సి ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణతోనైనా సచివాలయాల పనితీరు మెరుగుపడి ప్రజలకు సకాలంలో సేవలు అందుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.




