Nellore: నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులు వాడాలి: ఎస్పీ!

Nellore: నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల పోలీసు అధికారులకు సూచించారు.

A Praveen, Nellore
Published on: 18 Nov 2026 12:01 PM IST
Nellore
X

Nellore: నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పద్ధతులు వాడాలి: ఎస్పీ!

నెల్లూరు: నేర పరిశోధనలో పోలీస్ అధికారులు, సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెల్లూరు టౌన్ పోలీసు అధికారులకు ప్రత్యేక ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరస్థల పరిశీలన, శాస్త్రీయ పద్ధతుల్లో భౌతిక సాక్ష్యాధారాల గుర్తింపు, సేకరణ, భద్రపరచడం, ఫోరెన్సిక్ పరికరాల వినియోగంపై పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యక్ష క్షేత్రస్థాయి శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా నమూనా హత్య కేసు సంఘటనా స్థలాన్ని ఏర్పాటు చేసి, బాధితుడి గొంతు, కుడిచేతి మణికట్టు, గుండె భాగంలో గాయాలను చూపిస్తూ, రక్తపు మరకలున్న కత్తి, రెండు డిస్పోజబుల్ గ్లాసులు, రెండు బీరు సీసాలు, ఒక డాక్యుమెంట్, రెండు కుర్చీలను సాక్ష్యాధారాలుగా గుర్తించి, వాటి సేకరణ, భద్రపరచడం, ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించే విధానాలపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.

జిల్లాకు కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వ్యాన్‌లో మొత్తం 33 రకాల ఆధునిక ఫోరెన్సిక్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా సంఘటనా స్థలంలోనే కీలకమైన భౌతిక ఆధారాలను గుర్తించి, సేకరించేందుకు వీలుంటుందని వివరించారు.

ఈ వ్యాన్‌లో ఫింగర్ ప్రింట్ డెవలప్‌మెంట్ కిట్, డీఎన్ఏ శాంపిల్ కలెక్షన్ కిట్, సెక్సువల్ అసాల్ట్ కలెక్షన్ కిట్, ఫుట్/టైర్ కాస్టింగ్ కిట్, ఫోరెన్సిక్ లైట్ సోర్స్, బ్లడ్ అండ్ సీమెన్ కలెక్షన్ కిట్, ఎక్స్‌ప్లోజివ్ స్క్రీనింగ్ కిట్, గన్‌షాట్ రెసిడ్యూ కిట్, ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ ప్యాకింగ్ కిట్, జనరల్ ఇన్వెస్టిగేషన్ కిట్, నార్కోటిక్ డ్రగ్ కలెక్షన్ కిట్ తదితర ఆధునిక పరికరాలు ఉన్నాయి.

నేరస్థల పరిశీలన – సాక్ష్యాధారాల సేకరణ

నేరం జరిగిన వెంటనే సంఘటనా స్థలాన్ని భద్రపరచడం, అనవసర వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించడం, ఆధారాలు చెదిరిపోకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టడం ప్రతి దర్యాప్తు అధికారి బాధ్యత. సంఘటనా స్థలంలోని ప్రతి అంశాన్ని ఫొటోలు, వీడియోల ద్వారా నమోదు చేసి, నేరస్థల పరిశీలన నివేదికను పద్ధతి ప్రకారం తయారు చేయాలని సూచించారు.

వేలిముద్రలు, రక్తపు మరకలు, వెంట్రుకలు, డీఎన్ఏ నమూనాలు, పాదముద్రలు, టైర్ గుర్తులు, ఆయుధాలు, దుస్తులు తదితర భౌతిక ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో గుర్తించి సేకరించడంపై అవగాహన కల్పించారు.

సేకరించిన ఆధారాలు కలుషితం కాకుండా, వాటి సహజ స్థితి దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఆధారాన్ని విడివిడిగా ప్యాక్ చేసి, సరైన లేబులింగ్, సీలింగ్, డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. సాక్ష్యాధారాల సేకరణ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడం, పరీక్షల నివేదికలు పొందడం వరకు చైన్ ఆఫ్ కస్టడీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

వివిధ కేసుల్లో ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానం

హత్యలు, అత్యాచారాలు, POCSO కేసులు, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, నీటిలో మునిగి సంభవించే మరణాలు, పేలుడు పదార్థాలు, కాల్పులు, మాదకద్రవ్యాల కేసుల్లో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతి కేసు స్వభావాన్ని బట్టి అవసరమైన ఫోరెన్సిక్ పరీక్షలను నిర్వహించి, నేరానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సేకరించాలని వివరించారు. మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ ద్వారా సంఘటనా స్థలంలోనే ఆధారాలను గుర్తించడం, ప్రాథమిక పరిశీలన నిర్వహించడం, వాటిని తదుపరి పరీక్షల నిమిత్తం భద్రపరచడం వంటి అంశాలను ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

నాణ్యమైన దర్యాప్తు – నేర నిరూపణే లక్ష్యం

ప్రతి నేరానికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసేందుకు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలకు తావివ్వకుండా అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో పాటు ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలను సమన్వయంతో వినియోగించుకోవడం ద్వారా నిందితులను గుర్తించడంలో, నేర నిరూపణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

చిన్నపాటి ఆధారాన్ని సైతం నిర్లక్ష్యం చేయకుండా, దాని ప్రాధాన్యతను శాస్త్రీయంగా విశ్లేషించి, నేరంతో సంబంధాన్ని నిర్ధారించేలా దర్యాప్తు కొనసాగించాలని సూచించారు. దర్యాప్తు అధికారులు కేసు నమోదు నుంచి ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు ప్రతి దశలోనూ వృత్తిపరమైన నైపుణ్యం, శాస్త్రీయ దృక్పథం, పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అవగాహన పెంపొందించుకుంటూ, నూతన పద్ధతులను నేర్చుకోవాలని, శిక్షణలో పొందిన పరిజ్ఞానాన్ని విధుల్లో ఆచరణాత్మకంగా అమలు చేయాలని సూచించారు.

ఇటువంటి ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమాలు పోలీస్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు, క్లిష్టమైన కేసుల దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానాల్లో నేర నిరూపణకు బలమైన సాక్ష్యాధారాలు సమర్పించడం, నేరస్థులకు చట్టప్రకారం శిక్షలు పడేలా చేయడం, బాధితులకు సత్వర న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ పోలీస్ అధికారులు, సిబ్బంది, మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ సిబ్బంది పాల్గొని ఆధునిక ఫోరెన్సిక్ పరికరాల పనితీరు, వినియోగంపై ప్రత్యక్ష క్షేత్రస్థాయి శిక్షణ పొందారు.

A Praveen, Nellore

A Praveen, Nellore