Atmakur: పుట్టలో పాలు పోసి నాగదేవతకు మహిళల ప్రత్యేక పూజలు!
Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మహిళలు ఉపవాస దీక్షతో పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Atmakur: పుట్టలో పాలు పోసి నాగదేవతకు మహిళల ప్రత్యేక పూజలు!
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా పండుగ వేడుకలను నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోనూ ,చెరువుగట్టు నాగవరపమ్మ దేవాలయం వద్ద, నాగేంద్ర పురం ప్రాంతంలో ఉన్న నాగశిల వద్ద నాగదేవత విగ్రహాలు, పుట్టల వద్ద ప్రత్యేక అలంకరణలు చేపట్టి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు ఒక్కపొద్దు ఉపవాస దీక్షను ఆచరిస్తూ తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు చేసి, భక్తిశ్రద్ధలతో నాగమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పుట్టలో పాలు పోసి, పుట్టకు నాగబంధం దారాన్ని చుట్టి నాగదేవతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
నాగదేవత అనుగ్రహంతో కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మహిళలు ప్రత్యేకంగా ప్రార్థించారు. పట్టణవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనడంతో నాగుల చవితి వేడుకలు భక్తిపారవశ్యంతో సాగాయి.




