Nellore: నెల్లూరులో మరో రెండు కొత్త ఇసుక రీచులకు కలెక్టర్ అనుమతి

Nellore: నెల్లూరు జిల్లాలో నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా 2.19 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు కొత్త ఇసుక రీచులకు కలెక్టర్ హిమాన్షు శుక్లా అనుమతులు మంజూరు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 7 Oct 2026 5:48 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో మరో రెండు కొత్త ఇసుక రీచులకు కలెక్టర్ అనుమతి

Nellore: నెల్లూరు జిల్లాలో ఇసుక లభ్యతను మరింత పెంచి, నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా వినియోగదారులకు నిరంతరాయంగా ఇసుక సరఫరా చేయడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.

బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక లభ్యత, సరఫరా, కొత్త ఇసుక రీచుల ఏర్పాటుతో పాటు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీచులలో మిగిలి ఉన్న ఇసుకను వెలికితీయడం తదితర అంశాలపై సమీక్షించారు.

ఇసుక లభ్యతను పెంచే చర్యల్లో భాగంగా జిల్లాలో రెండు కొత్త ఓపెన్ సెమీ-మెకనైజ్డ్ ఇసుక రీచ్లకు అనుమతి మంజూరు చేశారు. అందులో నెల్లూరు రూరల్ మండలంలోని గొల్లకందుకూరు ఇసుక రీచ్‌లో 10.046 హెక్టార్ల విస్తీర్ణంలో 1,50,690 మెట్రిక్ టన్నుల ఇసుక, దేవరపాలెం ఇసుక రీచ్‌లో 4.567 హెక్టార్ల విస్తీర్ణంలో 68,505 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈ రెండు కొత్త రీచుల ద్వారా మొత్తం 2,19,195 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానుంది.

అలాగే, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న అప్పరావుపాలెం-V, విరువూరు-V సెమీ-మెకనైజ్డ్ ఇసుక రీచులలో మిగిలి ఉన్న ఇసుకను వెలికితీసేందుకు అవసరమైన అనుమతుల పొడిగింపుతో పాటు కార్యకలాపాల కాలపరిమితిని పొడిగించేందుకు కమిటీ అనుమతి మంజూరు చేసింది.

అప్పరావుపాలెం-Vలో 98,650 మెట్రిక్ టన్నులు, విరువూరు-Vలో 1,10,413 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 2,09,063 మెట్రిక్ టన్నుల ఇసుక మిగిలి ఉంది. ఈ పరిమాణాన్ని వెలికితీసేలా కార్యకలాపాల కాలపరిమితిని 2027, మే 31వ తేది వరకు లేదా మిగిలిన పరిమాణం పూర్తయ్యే వరకు, ఏది ముందైతే అంతవరకు పొడిగించే చర్యలు తీసుకున్నారు.

చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలోని 7.41 ఎకరాల పట్టా భూమిలో మేట వేసిన ఇసుకను డీ-కాస్టింగ్ చేసి సరఫరా చేసేందుకు అవసరమైన అనుమతులు లభించిన నేపథ్యంలో, ఇసుక అమ్మకం ధరను మెట్రిక్ టన్నుకు రూ.182గా నిర్ణయిస్తూ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆమోదం తెలిపింది.

జిల్లాలో ఇసుక లభ్యతను పెంచడంతో పాటు వినియోగదారులకు సులభంగా, నిరంతరాయంగా ఇసుక అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జేసి మొగిలి వెంకటేశ్వర్లు, మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస రావు, జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేశి నాయక్, డిటిసి చందర్, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్, డీపీఓ రామన్, పోలీస్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE