Nellore: పుస్తక పఠనంతో మేధో సంపత్తి, ప్రశాంతత.. ఎమ్మెల్యే ప్రశాంతి
Nellore: నెల్లూరులో గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రసంగం; శిథిలావస్థ గ్రంథాలయాల పునరుద్ధరణకు హామీ.
Nellore: పుస్తక పఠనంతో మేధో సంపత్తి, ప్రశాంతత.. ఎమ్మెల్యే ప్రశాంతి
నెల్లూరు: క్రమం తప్పకుండా పుస్తక పఠనం చేయడం వల్ల మేధో సంపత్తి పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అన్నారు. పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
నెల్లూరులో పౌర గ్రంథాలయ శాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి గారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు.
సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు చేయాలని.. తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు. డిజిటల్ ప్రపంచంతో పాటు పుస్తక పఠనానికి కూడా పిల్లలు సమయం కేటాయించేలా చూడాలన్నారు.
జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను ఎంతో చక్కగా నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మేకపాటి శాంతికుమారిని ఈ సందర్భంగా ప్రశంసించారు. మహిళలు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయగలరనడానికి ఈ వేడుకల నిర్వహణ నిదర్శనమని అభినందించారు.
జిల్లాలో పలు గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటన్నింటినీ పునరుద్ధరించి ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు హామీ ఇచ్చారు. కోవూరు నియోజకవర్గంలో పుచ్చలపల్లి సుందరయ్య గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన గ్రంథాలయ అభివృద్ధికి కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు చదివే ప్రదేశాలు మాత్రమే కాదని, విజ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే కేంద్రాలని ప్రశాంతి రెడ్డి గారు పేర్కొన్నారు. భావితరాలకు అందించగలిగే అమూల్యమైన జ్ఞాన సంపద గ్రంథాలయాలని, వాటి పరిరక్షణ, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.




