Nellore: రామాపురం కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో ప్రత్యేక చర్చ!

Nellore: నెల్లూరు జిల్లా రామాపురంలో జరగనున్న 'పల్లె పండుగ 3.0' ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఏలూరి సాంబశివరావు సమీక్ష నిర్వహించారు.

V. Kamaiah, Vinjamuru
Published on: 26 Sept 2026 12:36 PM IST
Nellore
X

Nellore: రామాపురం కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో ప్రత్యేక చర్చ!

Nellore: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 29 న నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు.

పల్లె పండుగ 3.0 కార్యక్రమం ఏర్పాట్లు,అధికారుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై వింజమూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో పాటు పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు,పారిశుద్ధ్యం,రవాణా, ఇతర మౌలిక సదుపాయాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం కార్యక్రమ పరిశీలకులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు కూడా అధికారులతో కలిసి కార్యక్రమ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru