Nellore: వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ

Nellore: నెల్లూరు సిటీ పరిధిలో పిఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు మంత్రి పొంగూరు నారాయణ రూ.20.46 కోట్ల విలువైన రుణాలు, క్రెడిట్ కార్డులు పంపిణీ చేశారు.

A Praveen, Nellore
Published on: 12 Oct 2026 8:11 PM IST
Nellore
X

Nellore: వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరు: పేదరిక నిర్మూలనతోనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, వీధి వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకుని స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. పీఎం స్వనిధి పథకం వీధి వ్యాపారుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపే గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు.

నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బార్కాస్‌ సెంటర్‌లో నిర్వహించిన పీఎం వీధి విక్రేతల ఆత్మనిర్భర్‌ స్వనిధి 2.0 కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారులకు చెక్కులు, క్రెడిట్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అందిన రూ.20.46 కోట్ల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ బ్యాంకుల నుంచి మరింత ఆర్థిక సహాయం పొందే అవకాశాలను పెంచుకోవాలన్నారు.

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుని స్వావలంబన దిశగా అడుగులు వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నారాయణ పేర్కొన్నారు. పేద కుటుంబాల ఆదాయం పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చిరు వ్యాపారులకు చేయూతనిస్తూ వారి ఉపాధికి భరోసా కల్పించే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

నిలిచిపోయిన పనులన్నీ పునఃప్రారంభం

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అవకతవకలతో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం తాత్సారం చేసిందని, 2019కు ముందు ప్రారంభించిన పనులను సైతం రాజకీయ కక్షతో నిలిపివేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

పేదల అభ్యున్నతిని అడ్డుకోవద్దు

ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నారాయణ ఆరోపించారు. పేదలకు శాశ్వత హక్కులు కల్పించేలా పట్టాలు పంపిణీ చేస్తుంటే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

విమర్శలు, అడ్డంకులు ఎన్ని ఎదురైనా పేదల అభ్యున్నతి కోసం తాను చేయాలనుకున్న పనులను చేసి తీరుతానని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు మేయర్‌ దేవరకొండ సుజాత, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, టౌన్‌ డీఎస్పీ దీక్ష, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాళ్లపాక అనూరాధ, కార్పొరేటర్లు కరీముల్లా, రామకృష్ణ, డివిజన్‌ నాయకులు ఏడుకొండలు, పిట్టి సత్యనారాయణ, హరికృష్ణ, అశోక్‌, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore