Nellore: నెల్లూరును దోమలు లేని నగరంగా మారుస్తాం: మంత్రి నారాయణ!

Nellore: నెల్లూరులో రూ. 237 కోట్లతో అభివృద్ధి పనులు. 2027 జూన్ నాటికి యూజీడీ పూర్తి చేసి దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి పొంగూరు నారాయణ.

A Praveen, Nellore
Published on: 11 Oct 2026 12:24 PM IST
Nellore
X

Nellore: నెల్లూరును దోమలు లేని నగరంగా మారుస్తాం: మంత్రి నారాయణ!

Nellore: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారాయణ.. పాఠశాలల ఆధునీకరణ, రోడ్ల నిర్మాణం, తాగునీటి ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు చేశారు. 2027 జూన్ నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసి, నెల్లూరును దోమలు లేని నగరంగా మారుస్తామని స్పష్టం చేశారు.

15వ డివిజన్ పరిధిలోని సర్వేపల్లి కాలువ కట్టపై 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు రాష్ట్ర మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం 51వ డివిజన్ సుబేదారుపేటలో ఆధునిక హంగులతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. బాజీ తోటలోని ప్రైమరీ స్కూల్‌ను స్వయంగా పరిశీలించిన మంత్రి, విద్యార్థుల సౌకర్యార్థం అదనపు భవనాలను తక్షణమే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పర్యటన సందర్భంగా స్థానికులు, కూటమి నాయకులు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. 'నాడు-నేడు' పేరుతో అరకొర పనులు చేసి వదిలేశారని మండిపడ్డారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తొలివిడతలో 23 స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశంలోనే నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్‌గా నిలుపుతామన్నారు. పాఠశాలల ఆధునీకరణకు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.నగరంలో రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్న మంత్రి హ్యామ్‌ ప్రాజెక్ట్ కింద నెల్లూరు అభివృద్ధికి ముఖ్యమంత్రి 237 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు.

ఈ నిధులతో రోడ్లు, పార్కులు, సెంట్రల్ డివైడర్లు, ఐలాండ్ల అభివృద్ధి పనులతో పాటు బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. యూజీడీ, తాగునీటి సరఫరా, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. 2027 జూన్ 12 నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తిగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరును దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి కనెక్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత,డిఈఓ బాలాజీ రావు,ఈఓ తిరుపాల్,ఎస్ఈ జానీ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ,మాజీ జెడ్పిటిసి విజేతా రెడ్డి,నగరపార్టీ అధ్యక్షులు మామిడాల మధు,రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు,డివిజన్ టీడీపీ నాయకులు పెంచల్ చౌదరి,అంచూరి శ్రీనివాసులు నాయుడు,కమతం ప్రశాంత్ కుమార్,క్లస్టర్ జోసెఫ్,స్థానిక జనసేన నేత సనత్,కూటమి నాయకులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore