Nellore: నెల్లూరులో అభివృద్ధి జాతర - రూ.5.26 కోట్లతో జంక్షన్ల సుందరీకరణ!

Nellore: నెల్లూరు నగరంలో రూ.5.26 కోట్లతో 14 ప్రధాన కూడళ్ల సుందరీకరణ, ఫౌంటైన్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 26 Sept 2026 12:02 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో అభివృద్ధి జాతర - రూ.5.26 కోట్లతో జంక్షన్ల సుందరీకరణ!

Nellore: నెల్లూరు నగరంలోని ప్రధాన కూడళ్లను సుందరీకరించడంతో పాటు ఐలాండ్లను అభివృద్ధి చేసి, ఫౌంటైన్లను ఏర్పాటు చేసేందుకు రూ.5.26 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం శంకుస్థాపన చేశారు.

వీఆర్సీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం, ట్రంక్ రోడ్డులోని గాంధీ విగ్రహం, ఏసీ సెంటర్‌లోని ఏసీ సుబ్బారెడ్డి విగ్రహం, ములుముడి బస్టాండ్ ఆజాద్ సెంటర్‌లోని వివేకానంద విగ్రహం, నర్తకి సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం, కనకమహల్ సెంటర్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం, నక్కలోళ్ల సెంటర్‌లోని పట్టాభిరామిరెడ్డి విగ్రహం, బోసుబొమ్మ (ఏబీఎం కాంపౌండ్) వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహం, వెంకటేశ్వరపురం సెంటర్‌లోని జాకీర్ హుస్సేన్ విగ్రహం, శెట్టిగుంట రోడ్డు వద్ద స్వచ్ఛ భారత్ విగ్రహం, నవాబుపేట బీవీఎస్ స్కూల్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహం, మినీబైపాస్‌లోని పూలే విగ్రహం, నేతాజీ విగ్రహం, యలమవారిదిన్నెలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఫౌంటైన్ల ఏర్పాటు, ఐలాండ్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా కూడళ్లలోని విగ్రహాలకు మంత్రి నారాయణ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ శంకుస్థాపన చేసిన 14 కూడళ్లలో ఫౌంటైన్ల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. తాను శిలాఫలకాలకు ప్రాధాన్యత ఇవ్వనని, శంకుస్థాపన చేసిన రోజే అభివృద్ధి పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం స్థలమార్పు చేయాలని ఆర్యవైశ్యులు కోరారని, అందరూ ఏకాభిప్రాయానికి వస్తే విగ్రహాన్ని మార్చి ఆ కూడలిని కూడా సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.

నెల్లూరు నగరంలో 17 పాఠశాలలను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. ఇప్పటికే 8 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, 3 పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి ప్రారంభించామని తెలిపారు. మరో 3 పాఠశాలలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

నగరంలో ప్రతిరోజూ 10 అభివృద్ధి పనులకు భూమిపూజ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నప్పటికీ 123 మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.50 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. ఇప్పటికే రూ.23 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. డిసెంబర్‌లోపు ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంత్రి వెంట కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE