Ramapuram: రామాపురం ‘పల్లె పండుగ 3.0’ సభను విజయవంతం చేయాలి!

Ramapuram: నెల్లూరు జిల్లా రామాపురంలో జరగనున్న పల్లె పండుగ 3.0 బహిరంగ సభను లక్ష మందితో విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 27 Sept 2026 6:01 PM IST
Ramapuram
X

Ramapuram: రామాపురం ‘పల్లె పండుగ 3.0’ సభను విజయవంతం చేయాలి!

Ramapuram: ఆత్మకూరులో టీడీపీ–జనసేన–బీజేపీ నాయకులతో మంత్రి ఆనం సమావేశం...రామాపురం సభకు భారీ జనసమీకరణ..లక్ష మందితో భారీ బహిరంగ సభ. ఈ నెల 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్డీఏ కూటమి శ్రేణులు సమాయత్తం కావాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో కోఆర్డినేటర్ కొమ్మలపాటి శ్రీధర్ తో కలిసి ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులతో, అధికారులతో విడివిడిగా మంత్రి ఆనం ప్రత్యేక సమావేశం నిర్వహించి సభ ఏర్పాట్లు, జనసమీకరణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, కూటమి శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

రామాపురంలో జరిగే పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నిలిచేలా నిర్వహించాలని మంత్రి ఆనం సూచించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి పెద్దఎత్తున ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చేలా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు.

గ్రామాల వారీగా జనసమీకరణ, వాహనాల ఏర్పాటు, ప్రజలను సభా ప్రాంగణానికి తీసుకురావడం, తిరిగి సురక్షితంగా వారి గ్రామాలకు చేర్చడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవలు తదితర ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని మంత్రి ఆనం స్పష్టం చేశారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

లక్ష మందితో భారీ బహిరంగ సభ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే రామాపురం సభకు భారీగా ప్రజలను తరలించి లక్ష మందితో భారీ బహిరంగ సభగా నిర్వహించేలా కూటమి శ్రేణులు కృషి చేయాలని మంత్రి ఆనం సూచించారు. ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చేలా పెద్దఎత్తున ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించాలని కోరారు.

మెట్ట ప్రాంతాలకు పల్లె పండుగ 3.0 వరం

ఉదయగిరి, ఆత్మకూరు వంటి మెట్ట ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండుగ 3.0 ఎంతో కీలకమని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల కోసం ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, ఉద్యాన పంటలు, పశుసంపదకు సంబంధించిన వసతులు అభివృద్ధి చెందితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ అభివృద్ధి పనులు

పల్లె పండుగ 3.0 కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో కేంద్ర వాటాగా రూ.5,391 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.5,694 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు.రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం, రూ.7,550 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.300 కోట్లతో పాడి రైతుల కోసం 22,000 మినీ గోకులాలు, రూ.225 కోట్లతో 50,000 ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం, రూ.110 కోట్లతో 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు, రూ.200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండలు తదితర పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

నెల్లూరు జిల్లా నుంచే వీబీ–జీ రామ్ జీ పథకానికి శ్రీకారం

గ్రామీణ ప్రాంతాల్లో రహదారి అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసేందుకు వీబీ–జీ రామ్ జీ పథకం కింద భారీగా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. వీబీ–జీ రామ్ జీ కింద రూ.1,750 కోట్లు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద రూ.3,800 కోట్లు, నాబార్డ్, సాస్కీ, ఇతర నిధుల ద్వారా మరో రూ.2,000 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల అనుసంధానానికి 6,000 కిలోమీటర్ల మేర పనులు చేపట్టడంతో పాటు, తారు రోడ్ల నిర్మాణం, ఉద్యానవన ప్రాంతాలను అనుసంధానించే రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

పల్లె పండుగ 1.0, 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో మార్పు

పల్లె పండుగ 1.0 కింద 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,514 పశువుల షెడ్లు, 21,000 వ్యవసాయ పంట కుంటలు, 64 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకం చేపట్టినట్లు తెలిపారు.పల్లె పండుగ 2.0 కింద 2,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 8,300 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 15,750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 86 వేల వ్యవసాయ కుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్ పిట్లు, 32 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి వివరించారు.

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధికి బాటలు

పల్లె పండుగ 3.0 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపడుతున్న భారీ గ్రామీణాభివృద్ధి కార్యక్రమమని మంత్రి ఆనం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు బలోపేతం కావడంతో పాటు రైతులు, పాడి రైతులు, ఉద్యాన రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు.రామాపురం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కూటమి శ్రేణుల ఐక్యతను చాటాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.

అన్ని మండలాలు, గ్రామాల నాయకులు సమన్వయంతో పనిచేసి పెద్దఎత్తున ప్రజలను సభకు తరలించాలని సూచించారు.ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొని పల్లె పండుగ 3.0 సభ ఏర్పాట్లు, జనసమీకరణ, రవాణా, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కొమ్మలపాటి శ్రీధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)