Indukurupeta: పల్లిపాడులో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
Indukurupeta: ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
Indukurupeta: పల్లిపాడులో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
Indukurupeta: గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు పల్లెల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఇందుకూరుపేట మండలం, పల్లిపాడు గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ‘పల్లె పండుగ 3.0’ కింద సీసీ రోడ్డు పనులతో పాటు ఉపాధి హామీ, ఎంపీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగించారు.
"గ్రామాల్లోనే మెరుగైన వైద్యం"
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, పల్లిపాడు గ్రామంలో గత 40 ఏళ్లుగా హెల్త్ క్లినిక్ లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానికులు తన దృష్టికి తెచ్చారని, వారి కష్టాలను తీరుస్తూ ఈరోజు క్లినిక్‌ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల్లో రూ.103 కోట్లతో నిర్మించిన 2676 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4,472 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,128 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.
అందులో భాగంగా ఇందుకూరుపేట మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.1.44 కోట్లతో కొరుటూరు, సోమరాజుపల్లి, ఇందుకూరుపేట బిట్–½, పల్లిపాడు ప్రాంతాల్లో ఒక్కో క్లినిక్‌ను రూ.36 లక్షలతో నిర్మించామని తెలిపారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే వైద్య సేవలు అందుతాయని, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. పల్లెల్లో ఎంతో నిబద్ధతతో సేవలు అందిస్తున్న వైద్య బృందానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
"పల్లె పండుగ 3.0తో పల్లెల ప్రగతి"
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.11,300 కోట్లతో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గానికి రూ.9.60 కోట్లు కేటాయించగా, 217 అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా పల్లిపాడు గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో ‘పల్లె పండుగ 2.0’ కింద రూ.10 కోట్లతో డ్రెయిన్లు, సీసీ రోడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు రూ.800 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
"కొత్త పింఛన్లు – అర్హులందరికీ ఇళ్ల స్థలాలు"
గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త పనుల వల్ల గృహ నిర్మాణ శాఖలో అనేక సమస్యలు తలెత్తాయని, అవన్నీ సరిదిద్ది అర్హులైన ప్రతి పేదవారికీ ఇల్లు, ఇంటి స్థలం ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డిసెంబరు 1వ తేదీ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు.
"పెన్నానది పొర్లుకట్ట నిర్మాణానికి కృషి చేస్తాం"
పెన్నానదిలో వరద ప్రవాహం పెరిగిన సమయంలో పొర్లుకట్ట వద్ద అక్కడక్కడా కట్టలు కోతకు గురై కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ సమస్య లేకుండా పెన్నానదికి రక్షణగా పొర్లుకట్ట నిర్మించాలని స్థానికులు కోరుతున్నారని ఈ అంశాన్ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో హోం మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. ఇది పెద్ద ప్రాజెక్టు కావడంతో మంజూరుకు కొంత సమయం పడుతోందని, తప్పకుండా మంజూరు చేయించి పొర్లుకట్ట నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
"స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే సీఎం చంద్రబాబు కి బహుమానం"
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని ఇందుకూరుపేట మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు వచ్చినట్లే, రాజకీయాల్లో చిన్నచిన్న అభిప్రాయభేదాలు ఉండటం సహజమని, నాయకులందరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకునిu సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కూటమి నాయకులందరూ తనకు సమానమేనని స్పష్టం చేశారు. ఇందుకూరుపేట మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కానుకగా ఇవ్వాలని కోరారు.




